మానవ మెదళ్లపై హ్యాకర్ల దాడి!

10 Sep, 2016 18:22 IST|Sakshi
మానవ మెదళ్లపై హ్యాకర్ల దాడి!

లండన్: వైర్‌లెస్ సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లుతున్న ఆధునికయుగంలో కంప్యూటర్లకు మనిషికి విడదీయలేని అనుబంధం ఏర్పడింది. కంప్యూటర్లలో నిక్షిప్తం చేసుకున్న మన సమస్త సమాచారాన్ని కొల్లగొట్టేందుకు సైబర్ క్రిమినల్స్ పెరిగిపోతున్నారు. ప్రస్తుతం కంప్యూటర్లకు పరిమితమవుతున్న హ్యాకర్లు మున్ముందు మనుషుల మెదళ్లను కూడా ప్రభావితం చేసే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రెయిన్ ఇంప్లాంట్స్ ద్వారా క్రిమినల్స్.. బ్రెయిన్‌ను ప్రభావితం చేసి ఆలోచనలను మార్చేసే ప్రమాదం ఉందని, దాన్నే శాస్త్రీయ భాషలో దీన్ని ‘బెయిన్ జాకింగ్’ అని అనవచ్చని వారు తెలిపారు.
 
‘డీప్ బ్రెయిన్ స్టిములేషన్ (డీబీసీ) సిస్టమ్’ అని పిలిచే బ్రెయిన్ ఇంప్లాంట్ ప్రస్తుతం వైద్యరంగంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. హార్ట్ పేస్‌మేకర్ తరహాలో పనిచేసే ఈ డీబీసీని పార్కిన్సన్, డిస్టోనియా(కండరాల సమస్యలు), భరించలేని శారీరక నొప్పులను నయం చేసేందుకు వైద్యులు ఉపయోగిస్తున్నారు. ఈ డీబీసీని కూడా హ్యాక్ చేయవచ్చని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నిపుణులు ప్రయోగాత్మకంగా నిరూపించారు.
 
బ్రెయిన్ జాకింగ్ ద్వారా రోగాన్ని మరింత తీవ్రం చేయవచ్చని లేదా కామవాంఛను పెంచడానికి, జూదానికి మెదడు బానిసయ్యేలాగా కూడా చేయవచ్చని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి లారీ పైక్రాఫ్ట్ ఇటీవల ఓ సెమినార్‌కు సమర్పించిన పత్రంలో పేర్కొన్నారు. బ్రెయిన్ జాకింగ్‌కు సంబంధించి ఎప్పటినుంచో కల్పిత సిద్ధాంతాలు ఎన్నో ఉన్నప్పటికీ ఇప్పుడవి నిజమయ్యే రోజులు వచ్చాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు