అతడు సముద్రాన్ని జయించాడు..

18 Feb, 2016 08:03 IST|Sakshi
అతడు సముద్రాన్ని జయించాడు..

1992, మే 25  బ్రెజిల్‌లోని గారాపరి తీర ప్రాంతం..  డెరెక్ రబెలో పుట్టింది ఆ రోజునే..  డెరెక్ పుట్టకముందే అతడి తండ్రి కొడుకును ప్రొఫెషనల్ సర్ఫర్ చేయాలని నిర్ణయించుకున్నాడు.. ఎందుకంటే.. డెరెక్ తండ్రికి సర్ఫింగ్ అంటే ప్రాణం.. ప్రపంచ ప్రఖ్యాత సర్ఫర్ డెరెక్ పేరునే తన కొడుకుకు పెట్టుకున్నాడు.  కానీ..  కొడుకు పుట్టాడనే ఆనందం ఎంతో సేపు నిలవలేదు.. డాక్టర్ షాకిచ్చే వార్త చెప్పాడు..  డెరెక్  అంధుడు! అతడికి గ్లకోమా(నీటి కాసులు)..

 సర్ఫింగ్ అంటేనే సాహస క్రీడ.  రాకాసి అలల తీరును అంచనా వేస్తూ.. వాటిపై అధిరోహిస్తూ.. సర్ఫింగ్ చేయడమంటే.. అన్నీ సవ్యంగా ఉన్నవాళ్లే జంకుతారే.. ఏ అంధుడూ సర్ఫింగ్ చేయగా చూడలేదే.. దీంతో తన కొడుకును సర్ఫర్ చేయాలనే ఆశలకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు..  కానీ డెరెక్ పెట్టలేదు. కలల్లో బతకడం అతడికి ఇష్టం లేదు.. కళ్లు లేకున్నా.. తండ్రి కలల సాకారంపైనే అతడి దృష్టంతా..
 అందుకే 17 ఏళ్ల వయసులో సర్ఫింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు. గతంలో ఎక్కడైనా అంధుడు సర్ఫింగ్ చేయడం చూశామా? ఇది ప్రాణాలకే ప్రమాదం అంటూ అందరూ నిరుత్సాహపరిచారు. కానీ తండ్రి తోడుగా నిలిచాడు. మూడేళ్ల అత్యంత కఠినమైన శిక్షణ.. సర్ఫింగ్ కోసం తనకున్న అమోఘమైన వినికిడి శక్తిని డెరెక్ ఉపయోగించుకున్నాడు.

 సీన్ కట్ చేస్తే.. అలలపై అలవోకగా సర్ఫింగ్ చేస్తూ.. ప్రపంచ ప్రఖ్యాత సర్ఫర్లతో శెభాష్ అనిపించుకుంటున్నాడు.  ‘నేను సాగరుడి శబ్దాన్ని వింటాను.. దాన్ని ఆస్వాదిస్తాను.. ప్రతి అల ఒక విభిన్నమైన శబ్దాన్ని చేస్తుంది. అదే నాకు దారి చూపుతుంది’ అని డెరెక్ చెబుతున్నాడు. అంతేనా.. డెరెక్ స్ఫూర్తిదాయక గాథపై ఇప్పటికే ఓ సినిమాతోపాటు పలు డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి.  .. డెరెక్.. సముద్రాన్ని జయించాడు..

మరిన్ని వార్తలు