బ్రెగ్జిట్ ప్రపంచానికి మంచిది కాదు...

5 Jul, 2016 14:56 IST|Sakshi
బ్రెగ్జిట్ ప్రపంచానికి మంచిది కాదు...

బ్రెగ్జిట్ పై ఎస్బీఐ ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య స్పందించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఛైర్ పర్సన్ గా బాధ్యతలు కొనసాగిస్తున్న ఆమె... బ్రెగ్జిట్ ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావాలని బ్రిటిష్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం... సరైంది కాదన్నారు.

ప్రపంచీకరణ నేపథ్యంలో బ్రెగ్జిట్ ప్రతికూల ప్రభావాన్ని అందిస్తుందని ఎస్బీఐ ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య అన్నారు.  భారతదేశంపై బ్రెగ్జిట్ ప్రభావం ఉన్నా లేకున్నా... యూరోపియన్ యూనియన్, బ్రిటన్ లతో వాణిజ్య సంబంధాలపై మాత్రం  పునః పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఓ ఫేస్ బుక్ లైవ్ ఛాట్ సందర్భంలో బ్రెగ్జిట్ పై అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా స్పందించారు. గ్లోబలైజేషన్ సమయంలో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే నిర్ణయం సరైంది కాదని, ఓ అడుగు వెనక్కు వేయడమేనని వివరించారు.

ప్రపంచం మొత్తం మమేకం అవ్వాల్సిన సమయంలో విడిపోవాలనుకోవడం.. తిరిగి ఓ అడుగు వెనక్కు వేయడమేనన్న ఆమె... మనకు ప్రపంచీకరణ మరింత ప్రయోజనాలను ఇస్తుందని నమ్ముతున్నానన్నారు.  సైద్ధాంతిక పరంగా చూస్తే... బ్రెగ్జిట్ సరైన నిర్ణయం కాదనిపిస్తోందని న్యూయార్క్ లో జరిపిన ఓ ఫేస్ బుక్ లైవ్ ఛాట్ సందర్భంలో తెలిపారు. ప్రస్తుతం న్యూయార్క్ నగరంలోని పెట్టుబడిదారులు, రేటింగ్ ఏజెన్సీలతో ఆమె సమావేశమయ్యారు.

మరిన్ని వార్తలు