Subrata Roy Sahara Death: సహారా చైర్మన్‌ సుబ్రతా రాయ్ కన్నుమూత

15 Nov, 2023 07:01 IST|Sakshi

సహారా ఇండియా గ్రూప్ చైర్మన్‌ సహారాశ్రీ సుబ్రతా రాయ్ సహారా మంగళవారం ముంబైలో తుది శ్వాస విడిచారు.  ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని బుధవారం లక్నోలోని సహారా షహర్‌కు  తరలించనున్నారు. అక్కడ అభిమానులు ఆయనకు నివాళులు అర్పించనున్నారు. 

రాయ్ మృతికి వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సహారా గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘సహారా ఇండియా పరివార్ మేనేజింగ్ వర్కర్, చైర్మన్ సుబ్రతా రాయ్ సహారా మృతికి విచారం తెలియజేస్తున్నాం. దూరదృష్టి కలిగి, అందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అయిన సహారాశ్రీ సుబ్రతా రాయ్ గుండెపోటుతో మంగళవారం రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. రాయ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారని’ దానిలో పేర్కొంది. నవంబర్ 12న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరారు.

సుబ్రతా రాయ్ సహారా 1948, జూన్ 10న జన్మించారు. సహారా ఇండియా పరివార్‌ను స్థాపించారు. బీహార్‌లోని అరారియా జిల్లాలో జన్మించిన సుబ్రతా రాయ్ కోల్‌కతాలోని హోలీ చైల్డ్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ సాంకేతిక సంస్థలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశారు. సహారాశ్రీగా పేరొందిన ఆయన తన వ్యాపారాన్ని 1978లో గోరఖ్‌పూర్ నుండి ప్రారంభించారు. 

2012లో ఇండియా టుడే మ్యాగజైన్ భారతదేశంలోని 10 మంది ధనవంతులలో సుబ్రతా రాయ్‌ పేరును చేర్చింది. నేడు సహారా గ్రూప్.. హౌసింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. 

సహారాశ్రీ మృతికి సమాజ్‌వాదీ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. ఎక్స్‌(ట్విట్టర్‌) మాధ్యమంగా ఒక పోస్ట్‌లో సమాజ్‌వాదీ పార్టీ సుబ్రతా రాయ్ మృతికి సంతాపం తెలిపింది. సహరాశ్రీ సుబ్రతా రాయ్ మరణం చాలా బాధాకరమని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు  మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
 

మరిన్ని వార్తలు