'ఉగ్రవాదుల కంటే మేమే పటిష్టం'

9 Feb, 2016 09:59 IST|Sakshi
'ఉగ్రవాదుల కంటే మేమే పటిష్టం'

ఒట్టావా: ఇస్లామిక్ గ్రూప్ ఉగ్రవాదుల స్థావరాలున్న ఇరాక్, సిరియా దేశాలపై గత కొన్ని నెలలుగా జెట్ విమానాల ద్వారా యుద్ధం కొనసాగిస్తున్న కెనడా కొద్ది రోజుల్లో వెనక్కి తగ్గనుంది. ఆ దేశాల్లో దాడులు కొనసాగిస్తోన్న తమ దేశ 6 యుద్ధ విమానాలను వెనక్కి రప్పించాలని తాజాగా నిర్ణయించింది. దేశ పౌరుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం అమెరికా యుద్ధ విమానాలు సిరియా, ఇరాక్ లపై దాడులు చేస్తుంది. ఫిబ్రవరి 22న ఆరు యుద్ధ విమానాలను కెనడాకు రప్పించనున్నట్లు రక్షణశాఖ మంత్రి హర్గిత్ సజ్జన్ వెల్లడించారు. ప్రధాని జస్టిన్ ట్రూడ్, రక్షణశాఖమంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఈ విషయమై సమావేశమయ్యారు. వచ్చే మూడేళ్లకుగానూ మిడ్ ఈస్ట్ ప్రాంతానికి సుమారు 5 వేల కోట్లు వెచ్చిస్తామని ప్రకటించారు.

ఉగ్రదాడులకు పాల్పడే మిలిటెంట్ల కంటే కెనడా చాలా పటిష్టంగా ఉందని ప్రధాని ట్రూడ్ వ్యాఖ్యానించారు. శత్రువులు అసలు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. టెర్రరిస్టులపై పోరాడుతున్న వారికి ఎప్పుడు తమ సహకారం ఉంటుందని, మూడింట రెండు వంతుల ప్రజల నిర్ణయం మేరకు దాడులకు ప్రస్తుతం ఆపివేస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ అవసరమనుకుంటే ఉగ్రదేశాలపై బాంబు దాడులు చేసేందుకు సిద్ధమని ట్రూడ్ వివరించారు.

>
మరిన్ని వార్తలు