పుజి, మిత్సుబిషిలతో చంద్రబాబు బృందం భేటీ

6 Jul, 2015 07:36 IST|Sakshi

టోక్యో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బృందం పర్యటన రెండో రోజూ జపాన్లో కొనసాగుతోంది. సోమవారం ఉదయం జపాన్‌ రాజధాని టోక్యోలో పుజి ఎలక్ట్రిక్‌ సంస్థ, మిత్సుబిషి కార్పొరేషన్‌ ప్రతినిధులతో చంద్రబాబు బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థలను చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.


ఇప్పటికే పుజి సంస్థ విజయవాడలో పైలట్‌ ప్రాజెక్టు కింద స్మార్ట్‌ గ్రిడ్‌ నిర్మాణం చేపట్టింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోనూ పుజి సంస్థ ప్రాజెక్టు చేపట్టనుంది. ఇక మిత్సుబిషి కార్పొరేషన్‌ విశాఖలో సమాచార అధ్యయన కేంద్రం నెలకొల్పనుంది. కృష్ణపట్నం క్లస్టర్‌ ఏర్పాటుకు మిత్సుబిషి సానుకూలత వ్యక్తం చేసింది. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల కార్యక్రమానికి సహకరించాలని చంద్రబాబు మిత్సుబిషి కంపెనీని కోరారు.

సీఎం వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, మున్సిపల్, ఆర్థిక, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు ఎ.గిరిధర్, పీవీ రమేశ్, ఎస్.ఎస్.రావత్, పరిశ్రమల మౌలిక వసతుల కల్పనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ ఉన్నారు. 8వ తేదీ వరకు బాబు బృందం జపాన్‌లోనే పర్యటిస్తుంది. అనంతరం 9, 10 తేదీల్లో హాంకాంగ్‌లో పర్యటిస్తుంది. 10వ తేదీ రాత్రి అక్కడ్నుంచీ బయల్దేరి హైదరాబాద్‌కు తిరిగి రానుంది.
 

మరిన్ని వార్తలు