బ్రిటన్‌ పీఎం సునాక్‌కు పదవీ గండం! 

15 Nov, 2023 07:58 IST|Sakshi

లండన్‌: తన మంత్రివర్గంలో అనూహ్యంగా మార్పులు చేసి, కొత్త వివాదానికి తెరలేపిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్‌ అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని, పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తూ సొంత పార్టీ(కన్జర్వేటివ్‌) ఎంపీ ఆండ్రియా జెన్‌కిన్స్‌ తాజాగా ‘1922 కమిటీ’ చైర్మన్‌ సర్‌ గ్రాహమ్‌ బ్రాడీకి లేఖ రాశారు. 

అయితే, రిషి సునాక్‌ ప్రధానమంత్రిగా  బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి డిమాండ్‌ తెరపైకి రావడం ఇదే మొదటిసారి. సొంత పార్టీ నుంచే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. యూకే మాజీ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ను మద్దతుదారుగా పేరుగాంచిన ఎంపీ ఆండ్రియా జెన్‌కిన్స్‌ రాసిన అవిశ్వాస లేఖ చర్చనీయాంశంగా మారింది. సునాక్‌ పదవి నుంచి తప్పుకోవాలని, ఆ స్థానంలో అసలు సిసలైన కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిని నియమించాలని జెన్‌కిన్స్‌ తేల్చిచెప్పారు. ‘జరిగింది ఇక చాలు. రిషి సునాక్‌ ఇంటికెళ్లాల్సిన సమయం వచ్చింది’ అని ‘ఎక్స్‌’లో జెన్‌కిన్స్‌ పోస్టు చేశారు. అవిశ్వాస లేఖను కూడా జతచేశారు. 

ప్రధానమంత్రిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బోరిస్‌ జాన్సన్‌ పదవి ఊడడానికి ముమ్మాటికీ సునాక్‌  కారణమని ఆయన ఆరోపించారు. సుయెల్లా బ్రేవర్మన్‌ను హోంమంత్రి పోస్టు నుంచి తొలగించడాన్ని జెన్‌కిన్స్‌ తప్పుపట్టారు. నిజాలు మాట్లాడినందుకే ఆమెపై వేటు వేశారని ఆక్షేపించారు. సునాక్‌ రాజీనామా కోసం తన సహచర ఎంపీలు కూడా గళమెత్తుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం కోసం తాము పోరాడుతున్నామని పేర్కొన్నారు.  

అవిశ్వాసం సాధ్యమేనా?  
అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల్లో 15 శాతం మంది ఎంపీలు అవిశ్వాసాన్ని కోరుతూ లేఖలు రాస్తే సునాక్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. పార్లమెంట్‌లో అవిశ్వాస పరీక్ష ఎదుర్కోక తప్పదు.  

నైపుణ్యం, అనుభవానికి పెద్దపీట: సునాక్‌  
మంతివర్గంలో మార్పులపై ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు. తన ప్రతిస్పందనను ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. దేశానికి దీర్ఘకాలంలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుట్టడానికి సిద్ధంగా ఉండే ఒక ఉమ్మడి బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నైపుణ్యం, అనుభవం, సమగ్రతకు పెద్దపీట వేశామన్నారు. దేశ కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బృందం తోడ్పడుతుందని వివరించారు.    

మరిన్ని వార్తలు