జస్టిన్‌ ట్రూడో Vs నెతన్యాహు.. ఇజ్రాయెల్‌ దాడులపై కౌంటర్లు..

15 Nov, 2023 09:08 IST|Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్ సేనల దాటికి గాజా విలవిల్లాడుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరుపుతున్న దాడుల్లో ఎన్నో అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌ దాడులో పిల్లలు, మహిళలు భారీగా సంఖ్యలో చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ దాడులపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తాజాగా ఓ కార్యక్రమంలో ట్రూడో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం సంయమనం పాటించాలని నేను కోరుతున్నాను. గాజాపై ఇ‍జ్రాయెల్‌ దాడులను ప్రపంచమంతా చూస్తోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతిచెందిన వైద్యులు, కుటుంబాలను కోల్పోయిన వారిని, ప్రాణాలతో బయటపడినవారిని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చూస్తున్నాము. మహిళలు, పిల్లలను టార్గెట్‌ చేస్తూ కూడా ఇజ్రాయెల్‌ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికైనా వారి విషయంలో మానవత్వం చూపించాలని కోరారు. ఇదే సమయంలో హమాస్‌ను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో సామాన్య పాలస్తీనియన్లను అడ్డుపెట్టుకోవడం సరికాదన్నారు. హమాస్‌ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరులను వెంటనే విడిచిపెట్టారని కామెంట్స్‌ చేశారు. 

ఇక, కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ పీఎం బెంజిమిన్‌ నెతన్యాహు కౌంటరిచ్చారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించిన నెతన్యాహు.. అక్టోబర్‌ ఏడో తేదీన హమాస్‌ దాడుల గురించి ప్రస్తావించారు. వారి దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృత్యవాపడ్డారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నది ఇజ్రాయెల్ కాదు. హోలోకాస్ట్ నుండి యూదులపై జరిగిన దాడుల్లో హమాస్‌ ఎంతో దారుణంగా వ్యవహరించింది. సామాన్య పౌరులను ఊచకోత కోసింది. ఇజ్రాయెల్‌.. గాజా పౌరుల కోసం సేఫ్‌ జోన్లు, మానవతా కారిడార్లను అందిస్తోంది. కానీ, హమాస్‌ వాటిని కూడా అడ్డుపెట్టుకుని నేరాలకే పాల్పడుతోంది. వారి వెనుక దాక్కోని కాల్పులకు తెగబడుతోందన్నారు. హమాస్‌ అనాగరిక చర్యలను ఓడించేందుకు అన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతివ్వాలని కోరారు. 

మరిన్ని వార్తలు