జింబాబ్వే సంక్షోభం వెనుక ఓ అగ్రదేశం?

21 Nov, 2017 11:47 IST|Sakshi

హరారే : జింబాబ్వే రాజకీయ సంక్షోభం ముగింపు దిశగా అడుగులు వేస్తోంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక దాదాపు ఖరారు కావటంతో పరిణామాలు సర్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉన్నట్లుండి హఠాత్తుగా ఈ తిరుగుబాటు జరగటం వెనుక ఓ అగ్ర దేశం హస్తం ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.

జింబాబ్వేతో వర్తక, వ్యాపారాలు నడిపే దేశాల జాబితాలో చైనానే అగ్రగామిగా ఉంది. ముగాబేతో మంచి మైత్రి సంబంధాలు కొనసాగిస్తూ... 1970 నుంచి అక్కడి వ్యవసాయ రంగం, షిప్పింగ్‌ ఇలా ప్రతీ రంగంలోనూ పెట్టుబడులు పెడుతూ వాణిజ్యం రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. యూఎస్‌ఎస్‌ఆర్‌.. జింబాబ్వేకు ఆయుధాల సరఫరాకు విముఖత వ్యక్తం చేసిన సమయంలో డ్రాగన్‌ కంట్రీయే ముందుకు వచ్చింది. చివరకు జింబాబ్వేలో నూతన పార్లమెంట్‌ నిర్మాణానికి కూడా ఆసక్తి చూపిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి చైనా ఇప్పుడు తిరుగుబాటు ఎందుకు చేయిస్తుందన్నది అనుమానంగా మారింది. 

అయితే గత కొన్నేళ్లుగా ముగాబేకు-చైనాకు మధ్య పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ముఖ్యంగా 2008లో ఆయుధాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని జింబాబ్వే ఆయుధాలను తిప్పి పంపటం చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అయితే అ‍ప్పటికే బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టి ఉండటంతో సైలెంట్‌ అయిన చైనా.. రక్షణ సహాయాన్ని మాత్రం క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ఆ తదనంతరం సందు దొరికినప్పుడల్లా ముగాబే పాలనపై పలుమార్లు అసంతృప్తి వెల్లగక్కుతూ వస్తున్న చైనా ముగాబేను గద్దె దిగిపోవాలంటూ పలుమార్లు పరోక్షంగా హెచ్చరిస్తూ వస్తోంది కూడా. 

అయినా తీరు మార్చుకోని ముగాబే తన మునుపటి విధానాలనే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో తమ దేశ పర్యటన సందర్భంగా చైనీస్‌ ప్రీమియర్‌ లీ కైయాంగ్‌ ముగాబేకు గట్టి వార్నింగ్‌నే ఇచ్చినట్లు చైనా మీడియా ఓ కథనం ప్రచురించింది కూడా. ఇక తన వయసు పైబడుతుండటంతో భార్య గ్రేస్‌ ముగాబేను అధ్యక్షరాలిని చేయాలన్న ఆలోచన సొంత పార్టీలో చిచ్చు రాజేసింది. దీంతో ఇదే అదనుగా భావించిన చైనా జింబాబ్వే మిలిటరీ జనరల్‌ కాన్‌స్టాంటినో చివెంగాను ఉన్నపళంగా చైనాకు రప్పించుకుని మరీ సైనిక తిరుగుబాటుకు ప్రోత్సహించి ఉంటుందన్న వాదన వినిపిస్తోది. దానికి తగ్గట్లే ఈ నెల మొదట్లో చివెంగా చైనా పర్యటన.. తిరిగొచ్చాక సైనిక తిరుగుబాటు ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోవటంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కానీ, చైనా మాత్రం జింబాబ్వేలో ఇంత పెద్ద రగడ జరుగుతున్నా కిక్కురుమనకుండా ఉండటం విశేషం. (ఇండియా టుడే కథనం ప్రకారం)

మరిన్ని వార్తలు