ఐఫోన్‌ కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. ఆపై..

1 Jan, 2019 14:28 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్‌కు ఉండే క్రేజే వేరు. జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే వారి సంఖ్య కోకొల్లలు. చైనాకు చెందిన వాంగ్‌(17) అనే టీనేజర్‌ కూడా ఈ కోవకు చెందిన వాడే. ఐఫోన్‌ కొనాలనే పిచ్చితో కిడ్నీ అమ్ముకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏడేళ్ల క్రితం చేసిన తప్పిదానికి ప్రస్తుతం మూల్యం చెల్లించుకుంటున్నాడు.

రోజూ డయాలసిస్‌ చేస్తేనే బతుకుతాడు
మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాంగ్‌కు ఐఫోన్‌ వాడాలనే కోరిక ఉండేది. అయితే తన దగ్గర అంత డబ్బులేకపోవడంతో కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో 2012లో.. 3200 డాలర్లకు(సుమారు 2,24, 000 రూపాయలు) ఓ వ్యక్తి అతడి కిడ్నీని కొనుగోలు చేశాడు. దీంతో ఐఫోన్‌ 4 కొనుక్కోవడంతో పాటు కుటుంబ అవసరాల కోసం మిగిలిన డబ్బును ఖర్చు చేశాడు. అయితే కొన్ని వారాలుగా అతడి ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్‌ దగ్గరికి వెళ్లగా.. మరో కిడ్నీకి ఇన్‌ఫెక్షన్‌ సోకి పాడైపోయిందనే విషయం బయటపడింది. దీంతో ప్రతిరోజూ డయలాసిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో.. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. కొడుకు బతికించుకునే దారి కనిపించడం లేదంటూ వాంగ్‌ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాకుండా వాంగ్‌ ఆపరేషన్‌ వెనుక కిడ్నీ రాకెట్‌ ముఠా హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపింది. కాగా ఐఫోన్‌ కోసం ఇలా ప్రాణాలు తెచ్చుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఐఫోన్‌ 4 కొనివ్వలేదని 2011లో చైనాకు చెందిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు