సైబర్‌ బాధిత దేశాల్లో భారత్‌ టాప్‌

9 Nov, 2023 04:41 IST|Sakshi

మూడేళ్లలో 278 శాతం పెరిగిన సైబర్‌ దాడులు

చైనా నుంచే అత్యధికంగా ముప్పు

అంతర్జాతీయ సైబర్‌ భద్రతా ఏజెన్సీ ‘సైఫిర్మా’ నివేదిక వెల్లడి  

సాక్షి, అమరావతి: భారత్‌లోని ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ ప్రైవేటు కంపెనీలపై విదేశాల నుంచి సైబర్‌ దాడులు అంతకంతకూ అధికమవుతున్నాయి. విదేశాల నుంచి సైబర్‌ దాడులు జరుగుతున్న దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో నిలిచింది.

2021 నుంచి 2023 మధ్య కాలంలో భారత్‌లోని సంస్థలపై సైబర్‌ దాడులు 278 శాతం పెరిగాయని సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ సైబర్‌ భద్రతా సంస్థ ‘సైఫిర్మా’ తాజా నివేదిక వెల్లడించింది. గతంలో పాకిస్తాన్‌ నుంచి భారత్‌పై సైబర్‌ దాడులు ఎక్కువగా జరగగా.. ప్రస్తుతం చైనా నుంచి అత్యధికంగా దాడులకు పాల్పడుతున్నారని ఆ నివేదిక తెలిపింది.

అందులోనూ చైనా ప్రభుత్వ సంస్థల కేంద్రంగానే.. భారతీయ సంస్థలపై సైబర్‌ దాడులకు పాల్పడటం గమనార్హం. భారత్‌పై అత్యధికంగా సైబర్‌ దాడులకు పాల్పడుతున్న దేశాల జాబితాలో రెండు, మూడు స్థానాల్లో రష్యా, ఉత్తర కొరియా ఉన్నాయి. భారత్‌లోని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలపై సైబర్‌ దాడుల్లో.. 72 శాతం విదేశాల్లోని ప్రభుత్వ సంస్థల కేంద్రంగానే జరుగుతున్నాయి. 

ప్రభుత్వ సంస్థలే ప్రధాన లక్ష్యం..
ప్రపంచవ్యాప్తంగా గత మూడేళ్లలో 13 శాతం సైబర్‌దాడులు భారతీయ సంస్థలు, కంపెనీలపైనే జరిగాయి. అమెరికా 9.6 శాతంతో రెండో స్థానంలో, ఇండోనేసియా 9.3 శాతంతో మూడో స్థానంలో, చైనా 4.5 శాతంతో నాలుగో స్థానంలో నిలిచాయి. అలాగే భారత్‌లోని ప్రభుత్వ సంస్థలపై 20.4 శాతం, ఐటీ–బీపీవో కంపెనీలపై 14.3 శాతం, ఉత్పాదక సంస్థలపై 11.6 శాతం, వైద్య సంస్థలపై 10 శాతం, విద్యా సంస్థలపై 10 శాతం, ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థలపై 9.8 శాతం, బ్యాంకింగ్‌ రంగ సంస్థలపై 9.5 శాతం, ఆటోమొబైల్‌ రంగ సంస్థలపై 8.3 శాతం, ఎయిర్‌లైన్‌ కంపెనీలపై 6.1 శాతం మేర సైబర్‌ దాడులు జరిగాయని నివేదిక వెల్లడించింది.  
 

మరిన్ని వార్తలు