సముద్రాలపై చైనా డ్రోన్లు!

25 Sep, 2016 19:57 IST|Sakshi

బీజింగ్‌: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంతోపాటు, తూర్పు చైనా సముద్రాలపై దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్లను చైనా మోహరించనుంది. సముద్రాలతోపాటు జపాన్‌తో వివాదం ఉన్న సెంకాకు దీవుల్లో సర్వేలు చేయడానికి, మ్యాప్‌లను రూపొందించడానికి ఈ డ్రోన్లు ఉపకరిస్తాయి. ఈ మేరకు అక్కడి ప్రభుత్వ అధీనంలో నడిచే పీపుల్స్‌ డైలీలో కథనం వచ్చింది. సెంకాకు దీవులను చైనా, జపాన్‌లు మావి అంటే మావి అంటున్నాయి.

ఈ డ్రోన్లతో తీరం నుంచి 80 నాటికల్‌ మైళ్ల వరకు జలాలను పూర్తిగా కవర్‌ చేయవచ్చు. సముద్రం ఉపరితలాన్ని 1,500 నాటికల్‌ మైళ్ల వరకు పరిశీలించవచ్చు. దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనని చైనా వాదిస్తోంది. అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ చైనా వాదనను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తమకు 30 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణంలో 12,186 దీవులు ఉన్నాయని చైనా తెలిపింది.

జడ్‌సీ–5బీ, జడ్‌సీ–10 అనే మానవ రహిత విమానాలను చైనా తయారుచేసింది. జడ్‌సీ–5బీ గరిష్టంగా 1,400 కి.మీ ఎత్తు వరకు ఎగరగలదు. 30 వరుస గంటలపాటు గాలిలో ఉండగలదు. దీని నిర్మాణం వల్ల ఇది ఏ ప్రాంతంలోకైనా దొంగతనంగా ప్రవేశించగలదు. 

మరిన్ని వార్తలు