పేదల కూలర్ బహు బాగు!

12 May, 2016 05:01 IST|Sakshi
పేదల కూలర్ బహు బాగు!

బంగ్లాదేశ్‌ : చిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. జీవితాలేమో కానీ ఓ చిన్న ఐడియా పైసా ఖర్చు లేకుండా గుడిసెలకు కూలర్లను తీసుకొచ్చింది. బంగ్లాదేశ్‌లో వేసవితాపాన్ని తీర్చింది. ‘గే ఢాకా’, ‘గ్రామీణ్ ఇంటెల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్’ సంస్థలు అభివృద్ధి చేసిన ఎకో కూలర్ కరెంట్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకునేందుకు మీ ఇంటి కిటికీ సైజుండే కార్డ్‌బోర్డు అట్ట, ప్లాస్టిక్ సీసాలు ఉంటే చాలు చల్లచల్లని కూలర్ రెడీ! అయితే దీని పనితీరు తెలుసుకోవాలంటే మీరు చిన్న ప్రయోగం చేయాల్సి ఉంటుంది.

మీ చేతిని నోటికి కొంత దూరంలో నోరు తెరిచి గట్టిగా గాలి ఊదండి.. వెచ్చటి గాలి మీ చేతులను తాకుతుంది కదా..? సరే ఇప్పుడు పెదవులను గుండ్రంగా చుట్టి ఇంకోసారి ఊదండి.. తేడా తెలిసిందా.. గాలి కొంచెం చల్లగా మారడం గమనించారా.. ఎకో కూలర్ కూడా పనిచేసేది ఇలాగే. ప్లాస్టిక్ బాటిళ్లను సగానికి కోసి రంధ్రాలు చేసిన కార్డ్‌బోర్డుకు బిగిస్తే చాలు. ఇంటి లోపలకి వచ్చే గాలి ఉష్ణోగ్రత దాదాపు 5 డిగ్రీల వరకు తగ్గిపోతుంది. చిన్న మార్గాల గుండా ప్రయాణించేందుకు గాలి పీడనానికి లోనవుతుంది. ఈ క్రమంలో గాలి ఉష్ణోగ్రత కూడా తగ్గి చల్లబడుతుంది. భలే ఐడియా కదూ..!

మరిన్ని వార్తలు