Chadrayaan-3: ఇస్రో కీలక ప్రకటన.. చంద్రునిపై ఉష్ణోగ్రతల వివరాలు పంపిన విక్రమ్‌

27 Aug, 2023 17:02 IST|Sakshi

న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ఉపగ్రహంలోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలం గురించి అధ్యయనం చేసి సమాచారాన్ని ఇస్రోకి చేరవేసింది. చంద్రుడి దక్షిణ ధృవం నేలకి సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చుతగ్గుల సమాచారం ప్రపంచానికి చేరడం ఇదే మొదటిసారి.   

చంద్రయాన్-3 విజయవంతంగా చందుడిపై అడుగుపెట్టడమే కాదు దాని కార్యాచరణను కూడా మొదలుపెట్టింది. శనివారం శివశక్తి పాయింట్ వద్దనున్న విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి  జారుకుని అధ్యయనాలను కూడా ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై 10సెం.మీ. లోతు వరకు ఉపరితలాన్ని అధ్యయనం చేసిన ప్రజ్ఞాన్ రోవర్ తొట్టతొలిసారి చంద్రుడి దక్షిణ ధృవం వద్దనున్న నేలకి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేసింది.

ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్) పేలోడ్ చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసింది. ఇస్రో ఈ సమాచారాన్ని తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. ఇస్రో షేర్ చేసిన ఈ గ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నుండి 60 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు తెలుస్తోంది. 'ఈ గ్రాఫ్‌ చంద్రుని ఉపరితలంపై లోతు వ్యత్యాసాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను సూచిస్తోంది. చంద్రుని దక్షిణ ధృవానికి సంబంధించి ఇదే మొట్టమొదటి అధ్యయనం. ఇంకా లోతైన పరిశీలనలు జరుగుతున్నాయి' అని ఇస్రో ట్వీట్ చేసింది.

చంద్రయాన్-3లో మొతం ఏడు పేలోడ్‌లు ఉండగా అందులో విక్రమ్ ల్యాండర్ నాలుగు, ప్రజ్ఞాన్ రోవర్ రెండు నిర్వహించనుండగా ఒకటి మాత్రం ప్రపల్షన్ మాడ్యూల్ నిర్వహించనుంది. ఈఏడు పేలోడ్‌లు ఒక్కొక్కటీ కొన్ని శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తాయి. చంద్రుడి నేలపై అధ్యయనం చేస్తున్న ChaSTE కాకుండా విక్రమ్‌లోని RAMBHA (అయాన్‌లు మరియు ఎలక్ట్రాన్‌లను అధ్యయనం చేయడానికి), ILSA (భూకంపాన్ని అధ్యయనం చేయడానికి), LRA (చంద్రుని వ్యవస్థ యొక్క గతిశీలతను అర్థం చేసుకోవడానికి) నిర్దేశించబడ్డాయి.     

ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్‌.. మెట్రో స్టేషన్‌ గోడలపై ఖలిస్థాన్ నినాదాల కలకలం

మరిన్ని వార్తలు