టర్కీలో తిరుగుబాటు

17 Jul, 2016 07:19 IST|Sakshi
టర్కీలో తిరుగుబాటు

- 265 మంది మృతి
- అధ్యక్షుడు ఎర్డోగన్‌పై సైనిక కుట్ర  
- అణచివేసిన సర్కారు

 అంకారా :  టర్కీలో అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవటం లక్ష్యంగా శుక్రవారం రాత్రి ఆ దేశ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేసింది. తిరుగుబాటును ప్రభుత్వ అనుకూల సైన్యం తిప్పికొట్టింది. రాజధాని అంకారాలోనూ, ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లోనూ శుక్రవారం రాత్రి కాళరాత్రే అయింది. అంకారాలోని పార్లమెంటు భవనంపై యుద్ధ విమానాలతో బాంబుదాడులు, అధ్యక్షుడి భవనం ముట్టడి, వీధుల్లో యుద్ధట్యాంకుల కవాతు, వారికి వ్యతిరేకంగా ఎర్డోగన్ పిలుపుతో ప్రజల భారీ ప్రదర్శనలు, సైనికులతో తలపడేందుకు ప్రయత్నాలు, వారిపై రెబల్ సైనికుల కాల్పులు.. తిరుగుబాటును అణచివేసేందుకు ప్రభుత్వ అనుకూల సైన్యం సాయుధ చర్యలతో టర్కీ అట్టుడికింది.

ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉందో, ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుతోందో తెలీనిగందరగోళం నెలకొంది. అయితే.. ప్రభుత్వం తెల్లవారేసరికి తిరుగుబాటును అణచివేసింది. హింసలో 104 మంది తిరుగుబాటు సైనికులు సహా మొత్తం 265 మంది చనిపోయారు. మరో 1,440 మంది గాయపడ్డారు. 3,000 మంది రెబల్ సైనికులను నిర్బంధించారు. దేశం పూర్తిగా తమ నియంత్రణలో ఉందని ప్రధాని బినాలి ఎల్దిరిమ్ ప్రకటించగా.. తిరుగుబాటును తిప్పికొట్టామని ఎర్డోగన్ ప్రకటించారు. తిరుగుబాటు కుట్ర ఎర్డోగన్‌కు బద్ధశత్రువు, అమెరికాలో నివసిస్తున్న మతగురువు ఫెతుల్లా గులెన్ పనేనని ప్రభుత్వం ఆరోపించింది. కుట్ర నేపథ్యంలో.. పలువురు సైనిక జనరళ్లతో పాటు టర్కీ అత్యున్నత న్యాయస్థానం జడ్జీల్లో ఒకరైన అల్ఫార్స్లాన్ అల్తాన్‌ను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. మొత్తం 2,700 మంది జడ్జీలను విధుల నుంచి తొలగించింది.

 అధ్యక్షుడు విహార యాత్రలో ఉండగా
 ఎనిమిది కోట్ల మంది జనాభా గల టర్కీకి గత 13 ఏళ్లుగా ఎర్డోగన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన టర్కీ ఆధునిక లౌకిక మూలాలను కాలరాస్తున్నారని, నియంతృత్వం దిశగా పయనిస్తున్నారని విమర్శకులు  ఆరోపిస్తున్నారు. అయితే.. ఎర్డోగన్ తనను వ్యతిరేకించే శక్తులను తప్పించి సైన్యంపై నియంత్రణ సాధించారని చెప్తారు. ముస్తఫా కెమాల్ అటాటర్క్ 1923లో టర్కీలో స్థాపించిన లౌకిక రాజ్యానికి రక్షణ కల్పిస్తుంది తామేనని ఆ దేశ సైన్యం విశ్వసిస్తుంటుంది. 1960 నుంచీ సైన్యం మూడుసార్లు నాటి ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసింది. 1997లో ఇస్లామిక్ సర్కారును కూలదోసింది.

ఈ నేపథ్యంలో.. ఎర్డోగన్ శుక్రవారం సముద్రతీర విహార కేంద్రమైన మార్మారిస్‌లో ఓ రిసార్ట్‌లో ఉండగా ఆర్మీలోని ఒక వర్గం తిరుగుబాటుకు దిగింది. సైనిక దళాల అధిపతి హులుసి అకార్‌ను బంధించి, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు అంకారా, ఇస్తాంబుల్‌లో ప్రధాన వీధులనుఆధీనంలోకి తీసుకుంది. అటాటర్క్ ఎయిర్‌పోర్టును మూసేసింది. పార్లమెంటు భవనంపై ఎఫ్-16 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఇస్తాంబుల్‌లో యూరప్‌ను ఆసియాతో కలిపే రెండు వంతెనలను మూసివేసి రాకపోకలను నిషేధించింది. దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, నిరవధిక సైనిక కర్ఫ్యూ విధించామని అన్నారు.  

 ట్విటర్, ఫేస్‌టైమ్‌లలో ఎర్డోగన్ పిలుపు...
 ఇది ఒక వర్గం సైనిక కుట్ర అని, సైన్యంలో దిగువ స్థాయి అధికారులు ఉన్నతాధికారులపై తిరుగుబాటు చేశారని ఎర్డోగన్ ట్విటర్‌లో, ఐఫోన్‌లో ఫేస్‌టైమ్ ద్వారా ఒక టీవీ చానల్‌లో తెలిపారు. ప్రభుత్వ మద్దతుదారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు వీధుల్లోకి రావాలన్నారు. దీంతో అధికార జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ మద్దతుదారులు వేలమంది జాతీయ పతాకాలు పట్టుకుని వీధుల్లోకి వచ్చి సైన్యానికి నిరసన తెలిపారు. అయితే.. చాలా కొద్ది మంది రెబల్ సైనికులకు స్వాగతం పలకటం కూడా కనిపించింది. ఇస్తాంబుల్‌లోని ఒక వంతెన వద్ద రెబల్ సైనికులతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. సైనికులు కాల్పులు జరపటంతో డజన్ల మంది గాయపడ్డారు. ఇస్తాంబుల్‌లోని టాక్సిమ్ స్క్వేర్‌లోనూ సైనికుల కాల్పుల్లో నిరసనకారులు గాయపడ్డారు.

రెండు నగరాల వీధులూ రణరంగాన్ని తలపించాయి. మరోవైపు.. ప్రభుత్వ అనుకూల సైన్యం రెబల్స్‌పై వైమానిక దాడి చేసింది. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన యుద్ధట్యాంకర్లను పేల్చేసింది. అంకారా, ఇస్తాంబుల్  బాంబు పేలుళ్లు, కాల్పులతో అట్టుడికాయి. తెల్లవారేసరికి.. రెబల్ సైన్యం లొంగిపోయింది. చాలా మంది సైనికులు నిరాయుధులుగా లొంగిపోయారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రధాని ఎల్దిరిమ్ ప్రకటించారు. తిరుగుబాటు సైన్యం బంధించిన సైనిక దళాల అధిపతి హులిసిని విడిపించగా.. ఆయనతో పాటు కలిసి ఎల్దిరిమ్ అంకారాలో మీడియాతో మాట్లాడారు. రాత్రి హింసలో 161 మంది ప్రజలు చనిపోయారన్నారు. రెబల్ సైనికులు 104 మంది హతమైన విషయాన్ని ప్రస్తావించలేదు.  పార్లమెంటు భవనం ధ్వంసమై కనిపించింది. దేశ సాయుధ దళాలకు తాత్కాలిక చీఫ్‌గా జనరల్ ఉమిత్ దుందార్‌ను నియమించినట్లు ఎల్దిరిమ్ ప్రకటించారు.

 గులెన్‌కు ఆశ్రయమిస్తున్న అమెరికాపై ధ్వజం...
 మరోవైపు.. గులెన్ ఉగ్రవాద సంస్థ నాయకుడని పరోక్షంగా ఆరోపిస్తూ.. ఆయనకు అమెరికా ఆశ్రయం ఇవ్వటాన్ని టర్కీ ప్రధాని ఎల్దిరిమ్ తప్పుపట్టారు. గులెన్‌కు వ్యతిరేకంగా టర్కీ వద్ద ఏదైనా సాక్ష్యముంటే తమకు అందించాలని అమెరికా పేర్కొంది. టర్కీ కుట్రలో పాత్ర పోషించినట్లు భావిస్తున్న ఎనిమిది మంది సైనికాధికారులు శనివారంహెలికాప్టర్‌లో గ్రీస్ చేరుకుని  శరణుకోరారు.  తిరుగుబాటు నేపథ్యంలో టర్కీకి వెళ్లాల్సిన చాలా అంతర్జాతీయ విమానాలను శుక్రవారం రాత్రి నుంచి రద్దు చేశారు. శనివారం ఉదయానికి కుట్రను అణచివేయటంతో దేశంలో జనజీవనం మళ్లీ యథాతథస్థితికి చేరుకుంటోంది. అటాటర్క్ విమానాశ్రయాన్ని తెరచి విమాన రాకపోకలను ప్రారంభిస్తున్నారు. టర్కీలో శాంతి నెలకొనేందుకు కృషి చేయాలని ప్రపంచ నేతలు పిలుపునిచ్చారు. ఎర్డోగన్ సర్కారు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు.
 
 కుట్ర సూత్రధారి గులెన్: ఎర్డోగన్
 అధ్యక్షుడు ఎర్డోగన్ రాత్రికి రాత్రే అంకారా చేరుకుని అటాటర్క్ ఎయిర్‌పోర్టు నుంచి, తర్వాత ఇస్తాంబుల్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం తమ నియంత్రణలోనే ఉందని, కుట్రను తిప్పికొట్టామన్నన్నారు. అయితే.. ‘కుట్ర ఏ స్థాయిలో ఉన్నాసరే ఈ రోజు రాత్రి వీధులు మన అధీనంలో ఉండాలి. ఏ క్షణంలోనైనా కొత్త తిరుగుబాటు రాజుకోవచ్చు’ అని అన్నారు. తిరుగుబాటు రాజద్రోహమని, కారకులు భారీ మూల్యం చెల్లిస్తారన్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా నుంచి నడుస్తున్న సమాంతర సర్కారే కుట్ర చేసిందంటూ.. అక్కడున్న గులెన్‌ను నిందించారు. ఒకనాటి మిత్రుడైన గులెన్ తనను కూలదోయాలని యత్నిస్తున్నట్లు ఎర్డోగన్ ఆరోపిస్తుంటారు. గులెన్ స్పందిస్తూ.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని అన్నారు.
 
 148 మంది భారతీయ బాలలు క్షేమం
 న్యూఢిల్లీ: వరల్డ్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొనడానికి టర్కీలోని ట్రాబ్‌జాన్‌లో ఉన్న 148 మంది భారతీయ బాలలు, 38 మంది అధికారులు క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ నెల 18 నుంచి వారు భారత్‌కు బృందాలుగా బయల్దేరతారని ట్వీట్ చేశారు. ఈ బాలల్లో  పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన అథ్లెట్ దండి జ్యోతికా శ్రీ ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతానికి 1,200 కి.మీ దూరంలో ఈ క్రీడలు జరుగుతున్నాయి. కాగా, వైఎస్‌ఆర్ కడప జిల్లా తొండూరుకు చెందిన ఎ.గౌతమ్ రెడ్డి కూడా టర్కీలో చిక్కుకుపోయారు దక్షిణ కొరియాలోని డేగు వర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆయన న్యూయార్క్ వెళ్తూ మార్గమధ్యంలో ఇస్తాంబుల్‌లో చిక్కుకుపోయారు.

 ప్రజాస్వామ్యానికి మద్దతివ్వండి .. భారత్: టర్కీలోని అన్ని పక్షాలు ప్రజాస్వామ్యానికి, ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పునకు మద్దతివ్వాలని, రక్తపాతాన్ని నివారించాలని భారత్  కోరింది. భారత ఎంబసీ అంకారా(905303142203), ఇస్తాంబుల్(905305671095)లో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసింది.
 
  విభిన్న ఆలోచనల ‘సుల్తాన్’
 ఇస్తాంబుల్: ఆధునిక టర్కీ చరిత్రలో ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డోగన్ చాలా ప్రత్యేకం. ఇస్లామిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన ఈయన  మిగిలిన నేతలతో పోలిస్తే భిన్నంగా వ్యవహరిస్తారనే పేరుంది. టర్కీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాడని.. అభిమానులంటారు. అధ్యక్షుడిగా 2014లో పగ్గాలు చేపట్టిన ఎర్డోగన్ (అభిమానులు సుల్తాన్ అని అంటారు) 2003లో ప్రధానిగా ఉన్నారు. అమెరికా తరహాలో అధ్యక్షుడే సర్వస్వంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఈయన ఆలోచన. అయితే లౌకిక వాదానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రమాదకరంగా మారాయని విపక్షాల ఆరోపణ. దీంతో అసంతృప్తిగా ఉన్న కొందరు సైనికులు చేసిన ఈ తిరుగుబాటుతో చిర్రెత్తిన ఎర్డోగన్.. తన వ్యతిరేకులంతా ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు.  తిరుగుబాటుకు.. ఆర్మీ చీఫ్, నిఘా, తదితర విభాగాలు మద్దతు తెలపలేదు. వీరంతా ప్రభుత్వానికి విధేయులగా ఉండటంతోనే.. ఎర్డోగాన్ తిరుగుబాటును విజయవంతంగా అణిచివేయగలిగారు.
 
 సైనిక తిరుగుబాట్ల టర్కీ
 మార్చి 27, 1960: ఆధునిక టర్కీ నిర్మాత ముస్తఫా కెమాల్ అటాటర్క్ ఆలోచనలకు విరుద్ధంగా అప్పటి అధికార పార్టీ వందలాది మసీదులను నిర్మించి అరబిక్‌లో ప్రార్థనలకు అనుమతించింది. అటాటర్క్ రూపొందించిన నిబంధనల సమీక్షకు ఆర్మీ ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకుంది. మార్చి 12, 1971:రాజకీయ సంక్షోభం తలెత్తడంతో మిలటరీ జనరల్ టాగ్‌మాక్ అల్టిమేటం జారీ చేశారు. రాజ్యాంగ బద్ధమైన, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేవరకు పాలనా బాధ్యతల్ని మిలట్రీ చేపడుతుందన్నారు. సెప్టెంబరు 12, 1980:  రాజకీయ అస్థిరతతో 1980, సెప్టెంబరు 12న ఆర్మీ  అధికారం చేజిక్కించుకుంది. కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.  ఫిబ్రవరి 27, 1997:  ఇస్లాం ప్రాబల్యం ఎక్కువవుతుండటంతో.. ‘పోస్ట్‌మాడర్న్ కూప్’ పేరుతో ఆర్మీ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించింది. ఇస్తాంబుల్ మేయర్‌గా ఉన్న  ఎర్డోగన్ ఇస్లామిక్ పద్యాన్ని  చదవడంతో ఆర్మీ  అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది.
 
 మా షూటింగ్‌కు ఇబ్బంది లేదు: బిర్సా
 కోల్‌కతా: ఇస్తాంబుల్‌లో సినిమా చిత్రీకరణ చేస్తున్న డెరైక్టర్ బిర్సా దాస్‌గుప్తా.. సైనిక తిరుగుబాటులో తమకు ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాలేదని, ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉందన్నారు. పశ్చిమబెంగాల్ ఐటీ మంత్రి బ్రాత్యా బసు సహా ఆ రాష్ట్రానికి చెందిన 35 మంది ఈ సినిమా బృందంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు