భారతీయలు పాక్‌లో వ్యాపారం చేయవచ్చా?

20 Nov, 2023 12:55 IST|Sakshi

దేశంలో వ్యాపారరంగాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. భారతీయుల వ్యాపార పరిధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగానూ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. భారతీయులెవరైనా విదేశాల్లో వ్యాపారం చేయాలని భావించినప్పుడు ముందుగా వారు అమెరికా, లండన్, పారిస్ ప్రాంతాల గురించి ఆలోచిస్తారని చాలామంది అంటుంటారు. భారతీయులు పొరుగుదేశమైన పాకిస్తాన్‌లో వ్యాపారం చేసే దిశగా ఎందుకు ఆలోచించరు? నిజానికి భారతీయ పౌరులు పాక్‌లో వ్యాపారం చేయడం సాధ్యమేనా? మన దేశంలోని వారు అక్కడ వ్యాపారం చేయాలంటే ఏ నియమనిబంధనలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

భారతీయ పౌరులు పాకిస్తాన్‌లో నిరభ్యంతరంగా వ్యాపారం చేసుకోవచ్చు. పాకిస్తాన్ తమ దేశంలో భారత్‌ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2012లో పాకిస్తాన్‌లో పెట్టుబడులను పరిమితం చేసే విదేశీ విధాన నియమాన్ని తొలగించింది. సెప్టెంబర్ 2012లో ఫెమా నిబంధనలు కూడా సవరించారు. భారత్‌కు చెందిన ఎవరైనా పాకిస్తాన్‌లో వ్యాపారం చేయవచ్చు.

పాకిస్తాన్‌లో వ్యాపారం చేయడానికి ముందుగా కంపెనీని నమోదు చేసుకోవాలి. కంపెనీ రిజిస్ట్రేషన్‌కు సాధారణంగా ఆరు వారాల సమయం పడుతుంది. దీనికి  సులభమైన ప్రక్రియ అందుబాటులో ఉంది. కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం మొదట దరఖాస్తు చేసి, అనంతరం అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఆ తర్వాతనే సంస్థకు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్‌కార్పొరేషన్‌ అందుతుంది. తర్వాత అమ్మకాలు, పన్నులకు సంబంధించి మిగిలిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఏర్పాటుకు కనీస మూలధనం పీకేఆర్‌  1,00,000(పాకిస్తాన్‌ రూపాయలు) తప్పనిసరి. పాక్‌లో ఏదైనా కంపెనీ పెట్టాలనుకునేవారికి అక్కడ చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ , వీసా తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే కంపెనీని నిర్వహించవచ్చు. 

పలువురు భారతీయులు పాక్‌లో వ్యాపారాలు చేస్తున్నారు.
పాకిస్తాన్‌లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత పెట్టుబడిదారులకు వ్యాపార అవకాశాలను కల్పించాయి. అపోలో టైర్స్, మారికో, జేకే టైర్స్, డాబర్, పియోమా ఇండస్ట్రీస్, హిమాలయ డ్రగ్ కంపెనీ, కొఠారీ ఫుడ్స్, హౌస్ ఆఫ్ మల్హోత్రా, జగత్‌జిత్ ఇండస్ట్రీస్ తదితర భారత బ్రాండ్‌లు పాకిస్తాన్‌లో తమ ఉత్పత్తులను విక్రయిస్తుంటాయి.
ఇది కూడా చదవండి: మనిషికి చిరాయువు ఇక సాధ్యమే?

మరిన్ని వార్తలు