‘ఆ డిస్కౌంట్లు అనైతికం.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’

28 Oct, 2023 20:01 IST|Sakshi

ఈ-కామర్స్ రంగంలో ధరలు పెంచి డిస్కౌంట్లను అందించడం వంటి అనైతిక పద్ధతులను అరికట్టడానికి ప్రభుత్వం, సంబంధిత నియంత్రణ సంస్థలు తక్షణమే చర్యలు తీసుకోవాలని వినియోగదారులకు సంబంధించిన మేధో సంస్థ ‘కట్స్‌ ఇంటర్నేషనల్’ (CUTS International) తాజాగా విడుదల చేసిన నివేదికలో సూచించింది.

 

అసలు ధరలు ఎక్కువగా చూపి పొదుపుపై ​​తప్పుడు అవగాహన కల్పించడం ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారని పేర్కొంది. ఫ్లాష్ సేల్స్‌పై పూర్తిగా నిషేధం విధించే బదులు, వినియోగదారుల రక్షణ చర్యలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, మార్కెట్‌లో వ్యాపార సంస్థలన్నింటికీ సమాన అవకాశాలు ఉండేలా చూడాలని సూచించింది.

న్యాయమైన, స్థిరమైన ఈ-కామర్స్ వ్యవస్థను ప్రోత్సహించడానికి, విక్రేతలు తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించే స్వయంప్రతిపత్తిని కలిగి ఉండటం చాలా కీలకం. డిస్కౌంట్‌ భారాన్ని విక్రేతలపై మోపడం ఆర్థిక ఒత్తిడికి దారి తీస్తుందని, వారి లాభాల మార్జిన్లు క్షీణించవచ్చని నివేదిక పేర్కొంది.

వినియోగదారుల సంక్షేమం కోసం, అమ్మకందారులందరూ మార్కెట్‌లో నిలదొక్కుకోవడం కోసం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఉత్పత్తులు/విక్రయదారుల 'సెర్చ్‌, ర్యాంకింగ్' పరంగా స్వీయ-ప్రాధాన్యత వంటి పద్ధతులలో పాల్గొనకూడదని సిఫార్సు చేసింది.

మరిన్ని వార్తలు