కొండెక్కిన ప్రేమ పెళ్లి

6 Aug, 2015 06:15 IST|Sakshi
కొండెక్కిన ప్రేమ పెళ్లి

కాలిఫోర్నియా: పాశ్చాత్య దేశాల్లో ప్రేమికులు వినూత్న పద్ధతిలో పెళ్లి చేసుకోవాలనే పోకడలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని జంటలు ఆకాశమార్గాన పెళ్లి చేసుకుంటే మరికొన్ని జంటలు సముద్ర గర్భంలో పెళ్లి చేసుకుంటున్నారు. ఆ కోవకు చెందిన జంటే ఎడ్జీస్, ఎలినా పెర్కాన్స్. వారు జీవితాంతం గుర్తుండి పోయేలా కాలిఫోర్నియా రాష్ట్రంలోని సియెర్రా నేవడ పర్వత ప్రాంతాల్లోని యోసేమైట్ నేషనల్ పార్క్‌లో...అందులోనూ 4500 అడుగుల ఎత్తులోవున్న కొండ శిఖరంపై పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతవరకు వారి పెళ్లి ముచ్చట బాగానే ఉంది. సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిదన్నట్లుగా....వారి పెళ్లి ఫొటోలను తీయాల్సిన ప్రముఖ కాలిఫోర్నియా ఫొటోగ్రాఫర్ బ్రియాన్ ర్యూబ్స్‌కు అసలు కష్టాలు ఇక్కడే ప్రారంభమయ్యాయి.


 రకరకాల లెన్సులు, స్టాండులతో బరువుగల కెమెరా బ్యాగును భుజానేసుకొని 4500 అడుగుల ఎత్తులోవున్న పర్వత శిఖరం ఎక్కడం మామాలు విషయమా! అందులో 42 ఏళ్ల వయస్సులో బ్రియాన్‌కు కొండెక్కడం మాటలా! ఎలాగూ ఒప్పుకున్నాక తప్పుతుందా అనుకుంటూ ఫిలిప్ నికోలస్ అనే అసిస్టెంట్‌ను తీసుకోని ముందురోజే కష్టపడి కొండెక్కాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఐదున్నర గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు ఎడ్డీస్, ఎలినాల పెళ్లి తంతును, ప్రమాణాలను కెమెరాతో షూట్ చేశాడు. ఈ పెళ్లికి అసిస్టెంట్ కెమెరా మేన్ ఫిలిప్ సాక్షిగా వ్యవహరించారు. అనంతరం షాంపేన్ పార్టీని ముగించుకొని న లుగురు కాలిఫోర్నియాకు చేరుకున్నారు.
 జూలై 25వ తేదీన జరిగిన ఈ పెళ్లిలో తాను 14 గంటలపాటు ఏకభిగినా షూట్‌చేసి అలసి పోయానని, కనీసం షాంపేన్ తాగే అదృష్టం కూడా లేకపోయిందని తొలుత తిట్టుకున్నాడు. అయితే ఆ పెళ్లి ఫొటోలు అద్భుతంగా రావడంతో పడిన శ్రమను మరిచిపోయానంటూ ఆ ఫొటోలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు.
 
 

 

మరిన్ని వార్తలు