మనిషికి చిరాయువు ఇక సాధ్యమే?

20 Nov, 2023 12:02 IST|Sakshi

సాధారణంగా ఎవరైనా ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షు కోరుకుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. శాస్త్రవేత్తలు, వైద్య పరిశోధకులు కూడా మనిషి జీవిత కాలం పొడిగించేందుకు పలు పరిశోధనలు సాగిస్తుంటారు. ఈ నేపధ్యంలో అనేక సిద్ధాంతాలు, ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. అయితే అవేవీ ఆశించినంత ఫలితాన్ని అందించలేదు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తల నూతన పరిశోధనలు మనిషి దీర్ఘాయువుకు గట్టి హామీని ఇచ్చేలా ఉన్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు యాంటీ ఏజింగ్ డ్రగ్ కోసం పలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు మనిషి దీర్ఘాయువుకు దోహదపడేలా పలు పరిష్కార మార్గాలను కనుగొంటున్నారు. వృద్ధాప్య కణాలను తొలగించి, అదే సమయంలో వాటి స్థానంలో కొత్త కణాలను సృష్టించడం ద్వారా దీర్ఘాయువు పొందవచ్చని చాలామంది భావిస్తుంటారు. తాజాగా బక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్‌ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ అనే నెమటోడ్‌లు (నీటిలో నివసించే సూక్ష్మజీవులు)లను ఎలుకలలో ప్రవేశపెట్టి వాటి జీవితకాలాన్ని పొడిగించడంలో విజయం సాధించారు. 

ఈ ప్రయోగాలు మనిషికి దీర్ఘాయువును అందించేందుకు చేస్తున్న పరిశోధనలకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్  నెమటోడ్‌లు పుష్కలంగా మైక్రోఫాగీలను కలిగివుంటాయి. మైక్రోఫాగీ అనేది ఒకరరమైన తెల్లరక్త కణం. ఇది మనిషి రోగ నిరోధకశక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మృత కణాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మైక్రోఫాగీ అనేది యాంటీఆక్సిడెంట్ కావడానికి తోడు న్యూరోప్రొటెక్టివ్ ప్రయోజనాలను అందిస్తుంది. 

కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్  నెమటోడ్‌లు అందించే ప్రయోజనాలను కొమారిన్‌లో కూడా ఉన్నాయని కనుగొన్నారు. ఇవి మొక్కలలో కనిపిస్తాయి. ముఖ్యంగా దాల్చినచెక్కలో అధికంగా ఉంటాయి. దాల్చిన చెక్క అనేది సెల్యులార్ ఆటోఫాగి, లైసోసోమల్ ఫంక్షన్‌లను నిర్దేశించడంలో కీలకంగా ఉండే ట్రాన్స్‌క్రిప్షన్ ఫ్యాక్టర్ కార్యాచరణను ప్రోత్సహిస్తున్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొమారిన్‌ అనేది శరీరంలో కణాంతర రీసైక్లింగ్ వ్యవస్థను చక్కగా నిర్వహిస్తుంది. దీని కారణంగా వయస్సు పెరిగే ‍ప్రక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. శాస్త్రవేత్త, పరిశోధకులు శంకర్ చింతా.. న్యూరోనల్ కణాలపై సహజ సమ్మేళనాల ప్రభావం గురించి అధ్యయనం సాగిస్తున్నారు. 

ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని ఈ అధ్యయనానికి సారధ్యం వహిస్తున్న శాస్త్రవేత్త జూలీ ఆండర్సన్ చెప్పారు. మైక్రోఫాగీ ప్రేరేపిత సమ్మేళనాలు యాంటీ ఏజింగ్ థెరపీకి కీలకంగా ఉపయుక్తమవుతాయి. ఇవి ఎలుకల కండరాల కణాలలో మైటోకాన్డ్రియల్ పనిచేయకపోవడాన్ని కూడా నిరోధించాయని పరిశోధనల్లో తేలింది. మైటోకాండ్రియా అనేది ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. లోపభూయిష్టమైన మైటోకాన్డ్రియల్ ఫంక్షన్  పార్కిన్సన్స్, అల్జీమర్స్ , అనేక హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, జీవక్రియ వ్యాధులు, వయసు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. మైటోకాన్డ్రియల్ కార్యకలాపాలు సవ్యంగా సాగాలంటే మైక్రోఫాగీ ప్రేరేపిత సమ్మేళనాలు అవసరం అవుతాయి. సమర్థవంతమైన మైటోఫాగి.. జీవుల జీవితకాలం పొడిగించిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిపై జరుగుతున్న పరిశోధనలు మనిషికి చిరాయువును ప్రసాదించే దిశగా ముందుకు సాగుతున్నాయి. 
ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్‌ టోపీ

మరిన్ని వార్తలు