ఆవు పేడతో మంచినీరు..!

3 Jun, 2014 00:41 IST|Sakshi
ఆవు పేడతో మంచినీరు..!

న్యూయార్క్: ఆవు పేడతో మంచినీటిని సృష్టించవచ్చట. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం అంటున్నారు అమెరికా పరిశోధకులు. తీవ్రమైన కరువు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించేందుకు ఈ కొత్త పద్ధతి చాలా ఉపయుక్తమని వీరు చెపుతున్నారు. అంతేకాక ఆవు పేడ నుంచి మంచినీరు వేరు చేయగా మిగిలిన వ్యర్థాలను ఎరువుగా కూడా వినియోగించుకోవచ్చని చెపుతున్నారు. అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ‘ద మెక్‌లాహన్ నట్‌రైంట్ సెపరేషన్ సిస్టమ్ (ఎంఎన్‌ఎస్‌ఎస్)’ అనే అతి సూక్ష్మ వడపోత వ్యవస్థను రూపొందించారు.

ఇది ఆవు పేడ నుంచి రసాయనాలు, ఇతర వ్యర్థాలను వేరు చేసి సురక్షితమైన మంచినీరు ను, అలాగే ఎరువులను అందిస్తుంది. దీనిపై మిచిగాన్ వర్సిటీ పరిశోధకుడు స్టీవ్ సఫ్ఫర్‌మన్ స్పందిస్తూ.. ‘‘మీ దగ్గర వెయ్యి ఆవులు ఉన్నట్లయితే వాటి నుంచి ఏటా పది మిలియన్ గ్యాలన్ల ఆవు పేడ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 90 శాతం మంచినీరే. అయితే ఆవుపేడలో రసాయనాలు, కార్బన్లు, రోగకారకాలు ఉంటాయి. ఆవు పేడ నుంచి మంచినీటిని తీయడం సంక్లిష్టమై న ప్రక్రియ. మంచినీరును తీసిన తర్వాత మిగిలే వ్యర్థాలు పర్యావరణానికి హానికరం. వీటిని కచ్చితంగా ఎరువుగా ఉపయోగించుకోవాలి’’ అని చెప్పారు. ప్రస్తుతం తాము రూపొందించిన విధానం ప్రకారం వంద గ్యాలన్ల ఆవు పేడ నుంచి 50 గ్యాలన్ల సురక్షిత మంచినీరును అందించవచ్చని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు