‘కుబేరుడి’ ఇంట విషాదం రేపిన పేలుళ్లు

22 Apr, 2019 17:01 IST|Sakshi

కోపెన్‌హాగ్‌ : శ్రీలంకలోని వరుస బాంబు పేలుళ్లు ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. ముష్కరుల ఉన్మాద చర్య కారణంగా వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వీరిలో సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు, వారి పిల్లలు కూడా ఉన్నారు. శ్రీలంక టీవీ సెలబ్రిటీ చెఫ్‌ శాంతా మయదున్నెతో పాటు ఆమె కూతురు నిళంగా కూడా మరణించగా... సెలవులు ఎంజాయ్‌ చేసేందుకు వచ్చిన డెన్మార్క్‌ ‘కుబేరుడి’  ముగ్గురు పిల్లలు కూడా మృతి చెందడం పట్ల విచారం వ్యక్తమవుతోంది. డెన్మార్క్‌లో అత్యంత సంపన్నుడిగా ఖ్యాతిగాంచిన ఆండర్స్‌ హోల్చ్‌ పోవల్‌సన్‌కు నలుగురు సంతానం. హాలిడే ట్రిప్‌ కోసం ఈయన ముగ్గురు పిల్లలు శ్రీలంకకు వచ్చారు. కాగా ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లలో వీరు మరణించినట్లు ఆండర్స్‌ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే వారు ఎక్కడ బస చేశారు, వారితో పాటు ఎవరు వెళ్లారన్న విషయాలపై మాత్రం స్పష్టతనివ్వలేదు.

కాగా ఫ్యాషన్‌ ఫర్మ్‌ ‘బెస్ట్‌సెల్లర్‌’ యజమాని అయిన ఆండర్స్‌.. డెన్మార్క్‌లోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందారు. ఫ్యాషన్‌ ప్రియులకు సుపరిచితమైన వెరో మోడా, జాక్‌ అండ్‌ జోన్స్‌ తదితర ప్రసిద్ధ బ్రాండ్లను ఎక్స్‌పోర్ట్‌ చేసే ఆండర్స్‌ కంపెనీ దేశీ ఆన్‌లైన్‌ రీటైల్‌ మార్కెట్లో  ప్రధాన స్టాక్‌హోల్డర్‌గా ఉంది. అంతేగాక స్కాట్లాండ్‌లో ఉన్న మొత్తం భూభాగంలో.. ఒకటి కంటే ఎక్కువ శాతం భూములకు ఆండర్స్‌ యజమాని అని ఫోర్బ్స్‌ నివేదిక వెల్లడించింది.

ఇక శ్రీలంకలోని ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మంది మరణించగా, 450 మంది గాయాలపాలయ్యారు. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. అయితే ఈ ఘటన కారణంగా లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెలవుల సీజన్‌ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం.. అందులో సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు మృతి చెందడం దురదృష్టకరమని.. వీటి ప్రభావం కచ్చితంగా తమ వ్యాపారిన్ని దెబ్బతీస్తుందని టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు