US-India Relations: బలమైన రక్షణ బంధం

11 Nov, 2023 05:17 IST|Sakshi
శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌

భారత్, అమెరికా నిర్ణయం

ఫలప్రదంగా విదేశాంగ, రక్షణ మంత్రుల చర్చలు

ముంబై, పఠాన్‌కోట్‌ ముష్కరులకు శిక్ష పడాల్సిందే

ఉమ్మడి ప్రకటనలో ఇరు దేశాల స్పషీ్టకరణ

చైనా దూకుడును సంయుక్తంగా అడ్డుకుంటాం: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు శుక్రవారం ఢిల్లీలో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ అస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వీటిలో పాలుపంచుకున్నారు.

రక్షణ ఉత్పత్తుల తయారీ, అరుదైన ఖనిజాల అన్వేషణ, అత్యున్నత సాంకేతికత వంటి రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం, పశ్చిమాసియాలో పరిణామాలు, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా సైనిక దూకుడుకు అడ్డుకట్ట వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై మంత్రులు చర్చించుకున్నారు. అనంతరం చర్చల వివరాలను వెల్లడిస్తూ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

ముంబైలో 26/11 ఉగ్ర దాడులకు, పఠాన్‌కోట్‌ దాడులకు పాల్పడ్డ ముష్కరులకు శిక్ష పడి తీరాల్సిందేనని ప్రకటన స్పష్టం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌కు మంత్రుల భేటీ స్పష్టమైన హెచ్చరికలు చేసిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంతో పాటు ఐసిస్‌ సహా ఉగ్ర సంస్థలన్నింటినీ నిర్మూలించేందుకు అన్ని దేశాలూ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచి్చనట్టు వివరించింది.

ఫలప్రదం: జై శంకర్‌
అమెరికా మంత్రులతో చర్చ లు ఫలప్రదంగా సాగాయని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికత రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతోపాటు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలపై చర్చించుకున్నామని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. అంతకముందు చర్చల ప్రారంభ కార్యక్రమంలో ఎస్‌.జైశంకర్‌ మాట్లాడారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఈ చర్చలు ఒక అద్భుత అవకాశమని అభివరి్ణంచారు. భారత్‌–అమెరికా మరింత సన్నిహితం కావడంతోపాటు ఉమ్మడి నిర్మాణాత్మక గ్లోబల్‌ అజెండాను రూపొందించుకోవాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ లక్ష్యమని గుర్తుచేశారు. ఇరు దేశాల సంబంధాలు ఇతోధికంగా వృద్ధి చెందుతున్నాయన్నారు.

ఇండో–పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత, వృద్ధిశీల, భద్రతాయుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యమిస్తున్నట్టు బ్లింకెన్‌ తెలిపారు. అంతేగాక అంతర్జాతీయ శాంతి, భద్రత తదితరాల సాధనకు కూడా ఇరు దేశాలూ కలసికట్టుగా కృషి చేస్తున్నాయన్నారు. భారత్‌–అమెరికా సంబంధాలకు రక్షణ ఒప్పందాలు మూలస్తంభంగా నిలుస్తున్నాయని రాజ్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. చైనా దూకుడుకు సంయుక్తంగా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
సంయుక్తంగా సాయుధ

సైనిక వాహనాల తయారీ: ఆస్టిన్‌
ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కీలకమైన సాయుధ సైనిక వాహనాల సంయుక్త తయారీ విషయంలో తక్షణం ముందుకు వెళ్లాలని భారత్‌–అమెరికా నిర్ణయించినట్టు లాయిడ్‌ ఆస్టిన్‌ తెలిపారు. ఇరు దేశాల సైనిక దళాల మధ్య సమాచార వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక వ్యవస్థల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచేందుకు ఉద్దేశించిన సెక్యూరిటీ ఆఫ్‌ సప్లై అరేంజ్‌మెంట్‌ (ఎస్‌ఓఎస్‌ఏ) ఒప్పందం ఖరారు తుది దశకు చేరిందని మంత్రి చెప్పారు.

జీఈ ఎఫ్‌–414 జెట్‌ ఇంజన్లను భారత్‌లో తయారు చేసేలా జనరల్‌ ఎలక్ట్రిక్‌ ఏరో స్పేస్, హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఊపందుకున్నాయన్నారు. అలాగే భారత్‌కు వీలైనంత త్వరగా అత్యాధునిక ఎంక్యూ–9బి డ్రోన్లను సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. ఇది 300 కోట్ల డాలర్ల ఒప్పందం.

ఆగడాలకు అడ్డుకట్ట పడాల్సిందే: భారత్‌
కెనడాలో ఖలిస్తానీ శక్తుల ఆగడాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమని అమెరికాకు భారత్‌ స్పష్టం చేసింది. మంత్రుల చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ క్వట్రా మీడియాకు వెల్లడించారు. వాటికి అడ్డుకట్ట పడాల్సిందేనని బ్లింకెన్, లాయిడ్‌లకు రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారన్నారు. ఈ విషయంలో భారత ఆందోళనను అర్థం చేసుకోగలమని వారు చెప్పారన్నారు.

ప్రధానితో మంత్రుల భేటీ
భారత్‌–అమెరికా ద్వైపాక్షిక బంధం ప్రపంచ శాంతికి, ప్రగతికి అతి పెద్ద చోదక శక్తిగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. మంత్రుల స్థాయి భేటీ అనంతరం అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు బ్లింకెన్, ఆస్టిన్‌ ఇరువురు శుక్రవారం రాత్రి ఆయనతో సమావేశమయ్యారు. విదేశంగ మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా భేటీలో పాల్గొన్నారు. సదస్సు జరిగిన తీరును, తీసుకున్న నిర్ణయాలను వారు మోదీకి వివరించారు.

‘‘ప్రజాస్వామ్యం, బహుళత్వ విలువలపై భారత్, అమెరికాలకున్న ఉమ్మడి విశ్వాసం తిరుగులేనివి. ఇరు దేశాల మధ్య జరిగిన మంత్రుల స్థాయి చర్చలు ఆశించిన ఫలితాలు సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అంటూ భేటీ అనంతరం మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డ సిల్వా శుక్రవారం మోదీకి ఫోన్‌ చేశారు. పశి్చమాసియా ఉద్రిక్తత తదితరాలపై నేతలు ఆందోళన వెలిబుచ్చారు.  అక్కడ యుద్ధ మేఘాలు తీవ్ర రూపు దాలుస్తుండటం, ఉగ్రవాదం, మతి లేని హింస భారీ జన నష్టానికి దారి తీస్తుండటం దారుణమన్నారు. బ్రెజిల్‌ జీ20 సారథ్యం సఫలం కావాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. 

మరిన్ని వార్తలు