70 ప్రాణాలు బుగ్గిపాలు

22 Feb, 2019 02:03 IST|Sakshi

ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవంతి కింది అంతస్తులో నిల్వ ఉంచిన రసాయనాలకు మంటలు అంటుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు భవనాలకు అగ్నికీలలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 70 మంది సజీవదహనం కాగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓల్డ్‌ ఢాకాలోని చాక్‌బజార్‌లో ఉన్న నాలుగంతస్తుల ‘హాజీ వహెద్‌ భవంతి’లో బుధవారం రాత్రి 10.40 గంటలకు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సందర్భంగా భవంతిలో నిల్వ ఉంచిన రసాయనాలు, కాస్మొటిక్స్, పెర్‌ఫ్యూమ్స్‌కూ ఈ మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. పక్కనే ఉన్న మిగతా భవంతులకు అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి.   200 మంది అగ్నిమాపక సిబ్బంది దాదాపు 14 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందనీ, మరో 25 మంది స్థానికుల జాడ తెలియరావడం లేదని అధికారులు అన్నారు. 

నివాసాల్లోనే రసాయనాల నిల్వ 
ఈ విషయమై దక్షిణ ఢాకా మేయర్‌ సయీద్‌ ఖొకోన్‌ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం ప్రారంభమైన భవంతి కింది అంతస్తును రసాయనాలు నిల్వచేసే గోదాముగా మార్చారని తెలిపారు. ఇదే భవనంలోని పైఅంతస్తుల్లో ప్రజలు నివాసం ఉంటున్నారన్నారు. ప్రమాదస్థలికి సమీపంలో ఓ వివాహ వేడుక జరగడం, రెస్టారెంట్లలో జనసందోహం ఉండటంతో మృతుల సంఖ్య పెరిగిందన్నారు. ఈ దుర్ఘటనలో కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయనీ, వీటికి డీఎన్‌ఏ పరీక్షలు అవసరమవుతాయని వెల్లడించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారన్నారు. రాత్రి కావడంతో ఓ భవంతి ప్రధాన ద్వారానికి తాళం వేశారనీ, దీంతో మంటల నుంచి తప్పించుకోలేక పలువురు స్థానికులు చనిపోయారని పేర్కొన్నారు. 

లక్ష టాకాల పరిహారం
ఈ ప్రమాదంపై బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్, ప్రధాని షేక్‌ హసీనాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు లక్ష టాకాలు(రూ.84,576), తీవ్రంగా గాయపడ్డవారికి 50,000 టాకాలు (రూ.42,288) పరిహారంగా అందిస్తామని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. ఢాకా అగ్నిప్రమాదంపై విచారణ జరిపేందుకు బంగ్లాదేశ్‌ హోం, పరిశ్రమల శాఖలు వేర్వేరుగా విచారణ కమిటీలను ఏర్పాటు చేశాయి. 

మరిన్ని వార్తలు