ఈ వేసవిలో భగభగలే!

22 Feb, 2019 02:04 IST|Sakshi

వాయవ్య దిశ నుంచి వేడిగాలులు వీచే అవకాశం

గరిష్టంగా 46 డిగ్రీల వరకు నమోదయ్యే చాన్స్‌

హైదరాబాద్‌లోనూ  45 డిగ్రీల ఉష్ణోగ్రతలు!

బేగంపేట్‌లోని వాతావరణ శాఖ అంచనా  

సాక్షి, హైదరాబాద్‌ : మండుటెండలు.. వేడిగాలులు ఈ వేసవిలో రాష్ట్ర ప్రజలను ఠారెత్తించనున్నాయి. ఫిబ్రవరి మూడో వారంలోనే ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో రాబోయే మండు వేసవిని తలచుకుంటే సొమ్మసిల్లే పరిస్థితి నెలకొంది. ఎల్‌నినో ప్రభావం తటస్థంగా ఉన్నప్పటికీ ఈసారి ఏప్రిల్‌ మూడో వారం నుంచి మే నెల చివరి వారం వరకు వాయవ్య దిశ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీచే ప్రమాదం ఉందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇలాంటి వాతావరణ పరిస్థితులు వేసవిలో సర్వసాధారణమేనని.. 2016, 2017 సంవత్సరాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. ఈసారి రాష్ట్రంలో ఏప్రిల్‌ మూడో వారం నుంచి మే చివరి వరకు పగటి ఉష్ణోగ్రతలు 45–46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రామగుండం, భద్రాచలంతోపాటు మైనింగ్‌ ఏరియాల్లో పగటి ఉష్ణోగ్రతలు 47–48 డిగ్రీల మేర నమోదవుతాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోనూ గరిష్టంగా 44–45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

ఈసారి ఎండలు ఎక్కువే.. 
గతేడాది ఏప్రిల్‌–మే నెలల్లో దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపుగా తేమగాలులు వీయడంతో ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ఉధృతి అంతగా లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి కేరళ, లక్షద్వీప్‌ నుంచి వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీని కారణంగా వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. కాగా 2016 ఏప్రిల్‌–మే నెలల్లో సుమారు 27 రోజులపాటు వడగాలులు వీయగా.. 2017లో ఇవే మాసాల్లో 23 రోజులపాటు వడగాలులతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు.

మరిన్ని వార్తలు