దారుణం : బిడ్డ తల తెంచేసింది

10 Aug, 2018 18:30 IST|Sakshi

కరాచీ: ఓ మహిళా డాక్టర్ నిర్లక్ష్యానికి  ఓ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది. అమ్మ పొత్తిళ్లకు చేరకముందే సుదూర తీరాలకు తరలిపోయింది. నార్మల్‌ డెలివరీ చేస్తానని చెప్పిన డాక్టర్‌, ప్రసవం సమయంలో బిడ్డ తలను, మొండాన్ని వేరు చేయడం కలకలం  రేపింది.  శిశువును బయటకు తీసే క్రమంలో తలను మాత్రం తీసి, మొండెను తల్లి గర్భంలోనే వదిలేసింది. ఊహించుకుంటేనే...గుండెలవిసిపోయే ఈ ఘటన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్‌ , క్వెట్టాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో జరిగింది.

ట్రిబ్యూన్‌ పత్రిక అందించిన సమాచారం అబ్దుల్ నాసిర్ తన భార్యను డెలివరీ కోసం ఒక ప్రయివేటు ఆసుపత్రి తీసుకొచ్చాడు. ఎలాంటి సమస్యా లేకుండా, సాధారణ ప్రసవం చేస్తానని డాక్టర్ అలియా నాజ్‌ నమ్మబలికింది. అందుకు10వేల రూపాయలు డిమాండ్‌ చేసింది. సరేనన్నాడు కానీ అంతా  సవ్యంగా జరుగుతుందని ఆశించిన అబ్దుల్‌  జీవితంలో మర్చిపోలేని ఘోరమైన ఘటన జరిగింది.

డాక్టర్‌ తన బిడ్డ తల, మొండాన్ని వేరు చేయడమేకాకుండా సివిల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా చెప్పారని అబ్దుల్‌ ఆరోపించారు. తన భార్య పరిస్థితి విషమించడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్స ద్వారా మిగిలిన భాగాలను తొలగించినట్టుచెప్పారు. అలాగే మెడికల్‌ రిపోర్టు ఇచ్చేందుకు ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది  నిరాకరించారని  వాపోయారు.

ఇది ఇలా ఉంటే ఆరోపణలుఎదుర్కొంటున్న డా.అలియా జిల్లా ఉప ఆరోగ్య అధికారిగా పనిచేస్తున‍్నట్టు సమాచారం. మరోవైపు ఈఘటనపై బలూచిస్తాన్‌ ముఖ్యమంత్రి  ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. విచారణ అనంతరం చట్టపరమైన కఠిన చర్య తీసుకుంటామని ఆరోగ్య మంత్రి   హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు