కరోనా టీకా కోసం యూఎస్‌ కుయుక్తులు!

16 Mar, 2020 07:57 IST|Sakshi

బెర్లిన్‌: కరోనా వైరస్‌ను నిర్మూలించే టీకాను రూపొందించే పరిశోధనలో ఉన్న ఒక జర్మన్‌ సంస్థ నుంచి ఆ టీకా హక్కులను పొందేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారన్న వార్త యూరప్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై జర్మనీ ప్రభుత్వం కూడా స్పందించింది. టీకాను జర్మనీ, యూరోప్‌ల్లోనే ఉత్పత్తి చేయాలనేది జర్మన్‌ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేసింది. జర్మనీకి చెందిన బయోటెక్‌ కంపెనీ ‘క్యూర్‌వాక్‌’ కరోనా వైరస్‌కు టీకాను రూపొందించే పనిలో ఉంది. ఆ సంస్థ నుంచి ఆ టీకాకు సంబంధించిన అన్ని హక్కులను సొంతం చేసుకోవాలని, ఆ టీకా వినియోగాన్ని అమెరికాకు మాత్రమే పరిమితం చేయాలని ట్రంప్‌ ఆలోచన అని యూరప్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అమెరికా స్పందించింది. (విజృంభిస్తున్న కోవిడ్‌.. యూరప్‌ అతలాకుతలం)

‘వ్యాక్సిన్‌ని రూపొందించే పరిశోధనల్లో ఉన్న అనేక కంపెనీలతో అమెరికా సంప్రదింపులు జరుపుతోంది. ఆ టీకాను అమెరికాకే పరిమితం చేసే ఆలోచన లేదు. దాన్ని ప్రపంచంతో పంచుకుంటాం’ అని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కాగా, తాము కనిపెట్టిన వ్యాక్సిన్‌తో సోమవారం క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు కైజర్‌ పర్మనెంటే వాషింగ్టన్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనాలకునేవారు తమను సంప్రదించవచ్చని, దీని ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ ఉండవని పరిశోధకులు ఇంతకుముందే తెలిపారు. (కరోనా వైరస్‌ గురించి అతనికి ముందే తెలుసా?)

మరిన్ని వార్తలు