మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్‌ న్యూమోనియా కలకలం..చిన్నారులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు

23 Nov, 2023 11:49 IST|Sakshi

చైనాలో కరోనా మాదిరి మిస్టీరియస్‌ న్యూమోనియా కలకలం

చిన్నారులతో కిక్కిరిసిన ఆస్పత్రులు

కోయబత్తూర్‌లోనూ ఇదే మాదిరి కలకలం

కరోనా మహమ్మారి సృష్టించిన విలయం గురించి తెలిసిందే. ఆ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకోస్తోంది ప్రజల్లో. అలాంటిది మళ్లీ కరోనా రీపిట్‌ అంటేనే బెంబేలెత్తిపోతున్నారు జనాలు. అందులో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా కరోన పుట్టినిల్లు అయినా చైనా సంగతి చెప్పనక్కర్లేదు. ఎక్కువ కాలం నిర్బంధంలో ఉన్న దేశం అది. పైగా చాలా ఏళ్ల పాటు కరోనా మహమ్మారి ఆ దేశాన్ని ఓ పట్టాన వదల్లేదు. కానీ ఇప్పుడూ తాజాగా మళ్లీ కరోనా మాదిరి అంతు చిక్కని వ్యాధులు చైనాలో విజృంభిస్తున్నట్లు వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

సాక్షాత్తూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికారులే విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేగాక ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు కూడా నివేదించారు. దీంతో ఒక్కసారిగా అందరిలోనూ తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఇన్‌ఫ్లుఎంజా లాంటి వైరల్‌ వ్యాధి ప్రభలంగా ఉంది. ఈ వ్యాధి బారిన అధికంగా చిన్నారులే పడుతున్నట్లు సమాచారం. అక్కడ ఆస్పత్రులన్నీ ఈ అనారోగ్యం బారిన పడిన పిల్లలతోనే నిండిపోయాయని చెబుతున్నారు. పిల్లలంతా అంతుచిక్కని న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సాధారణ ఔట్‌ పేషంట్‌ క్లినిక్‌లు లేవని జబ్బు పడిన పిల్లలతోనే ఆస్ప్రుత్రులన్ని కిక్కిరిసి ఉన్నాయని చెబుతున్నారు.

కరోనా ఆంక్షాలను తొలగించాక దేశంలో శ్వాసకోశ వ్యాధులు అధికమైనట్లు డబ్ల్యూహెచ్‌ఓకి వెల్లడించారు. ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రం కాకుండా ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోమని డబ్ల్యూహెచ్‌ఓ చైనా అధికారులను కోరింది. కోవిడ్‌-19 రూపాంతరం సార్క్‌ కోవిడ్‌-2.. ఇన్‌ఫ్లుఎంజా, మైక్రోప్లాస్మా న్యుమోనియా వంటి వ్యాధులకు దారితీస్తున్నట్లు కరోనా మహమ్మారి ప్రారంభంలోనే డబ్ల్యూహచ్‌ఓ హెచ్చరించింది. ఇప్పుడూ చైనా పిల్లల్లో అలాంటి వ్యాధుల సంక్రమణే ఎక్కువగా ఉండటంతో చైనా అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్‌ఓ) ఆ వ్యాధుల  పరిస్థితి, తీవ్రతకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదించమని చైనా అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా ఉత్తర చైనాలో గత మూడు ఏళ్లలో సరిగ్గా ఇదే టైంలో సుమారు అక్టోబర్‌ మధ్య కాలంలో ఈ ఇన్‌ఫ్లుఎంజా వంటి వైరల్‌ అనారోగ్యాలు అధికమైనట్లు డబ్బ్యూహెచ్‌వో పేర్కొంది. ఇలాంటి అనారోగ్యం బారిన పడిన వారిని దూరంగా ఉంచడం, టీకాలు వేయించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మాస్క్‌లు వంటివి ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని చైనా ప్రజలకు సూచించింది డబ్ల్యూహెచ్‌ఓ.

భారత్‌లోనూ పెరుగుతున్న అంతు చిక్కని జ్వరాలు..
తమిళనాడులోకి కోయంబత్తూరులో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అక్కడ జ్వరానికి సంబంధించిన కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో అధికారులు మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వైరల్‌ ఫీవర్లు అధికమైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వైరల్‌ ఫీవర్లు బారిన పిల్లలు, పెద్దలు పడటమే గాక అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో కోవిడ్‌ మాదిరిగానే జాగ్రత్తలు పాటించమని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. 

(చదవండి: ఉద్దానంలోని మరణాలకు గల కారణాన్ని కనిపెట్టిన పరిశోధకులు! చాలా మరణాలు..)

మరిన్ని వార్తలు