కశ్మీర్‌పై మరోసారి ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

21 Aug, 2019 15:46 IST|Sakshi

కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధం అంటూ కామెంట్స్‌

వాషింగ్టన్‌ డీసీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కశ్మీర్‌ విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధమని నెల కిందట పేర్కొన్న ట్రంప్‌ తాజాగా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి సంసిస్ధంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. 

ట్రంప్‌ సోమవారం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడి.. భారత్‌ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా నిగ్రహం పాటించాలని సూచించిన సంగతి తెలిసిందే. అంతకుముందు భారత్‌ ప్రధాని మోదీ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. భారత్‌కు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టేలా పాక్‌ మాట్లాడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజాగా వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ..  కశ్మీర్‌ చాలా సంక్లిష్టమైన అంశమని, మతానికి సంబంధించి అంశం ఇదని చెప్పుకొచ్చారు. 

‘కశ్మీర్‌ చాలా సంక్లిష్టమైన ప్రాంతం. అక్కడ హిందువులు, ముస్లింలు ఉన్నారు. వారి మధ్య అంత సామరస్యం ఉందని నేను అనడం లేదు. ఇరుపక్షాల ప్రజలు తమను వేరేవారు పాలించాలని కోరుకుంటున్నారు. ఇరుదేశాలు మధ్య కూడా దశాబ్దాలుగా అంతగా సంబంధాలు లేవు. నిజాయితీగా చెప్పాలంటే అక్కడ బద్దలయ్యే పరిస్థితి నెలకొంది. ఇరుదేశాల ప్రధానులతో నేను మాట్లాడాను. వారు నా స్నేహితులు. ఇద్దరూ తమ దేశాలను ప్రేమిస్తున్నారు. వారు క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా అక్కడ పరిస్థితులు క్లిషంగా ఉన్నాయి. కాల్పులు కొనసాగుతున్నాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. గతంలో కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వానికి ట్రంప్‌ ఉత్సాహం ప్రదర్శించినప్పటికీ.. ఆయన ఆఫర్‌ను భారత్‌ నిర్ద‍్వంద్వంగా తిరస్కరించడమే కాకుండా.. కశ్మీర్‌ భారత్‌ అంతర్భాగమని, దీనిపై వివాదం ఏమైనా ఉంటే ద్వైపాక్షికంగా పరిష్కరించకుంటామని తేల్చి చెప్పింది.

చదవండి: ఇమ్రాన్‌..జాగ్రత్తగా మాట్లాడండి!

మరిన్ని వార్తలు