త్రిష‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. సారీ చెప్ప‌లేదంటూ ప్లేటు తిప్పేసిన న‌టుడు

29 Nov, 2023 13:15 IST|Sakshi

ఈ మ‌ధ్య ఫిల్మీదునియాలో, సోష‌ల్ మీడియాలో మారుమోగుతున్న పేరు మ‌న్సూర్ అలీ ఖాన్‌. ఇటీవ‌ల ఈయ‌న హీరోయిన్‌ త్రిష గురించి చేసిన వ్యాఖ్య‌లు పెద్ద తుపానునే సృష్టించాయి. లియో సినిమాలో త్రిష‌తో బెడ్ రూమ్ సీన్స్ ఉంటాయ‌ని భావించాన‌ని, కానీ అలాంటి స‌న్నివేశాలు లేక‌పోవ‌డంతో నిరాశ‌ప‌డ్డాన‌ని న‌టుడు మ‌న్సూర్ చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై త్రిష ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా మొద‌ట క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డానికి మొండికేసిన మ‌న్సూర్ త‌ర్వాత సారీ చెప్తూ ఓ లేఖ కూడా విడుద‌ల చేశాడు.

వ్యంగ్యంగా సారీ చెప్పిన న‌టుడు
'నేను కత్తి లేకుండా ఒక వారం పాటు యుద్దం చేశాను. ఈ వార్‌లో రక్తపాతం లేకుండానే గెలిచాను! ఏదేమైనా నా వ్యాఖ్యలతో త్రిష మనసు బాధ‌పెట్టినందుకు క్షమాపణ చెబుతున్నా. ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది. అప్పుడు లక్షలాది మంది చనిపోవడంతో, అశోక చ‌క్ర‌వ‌ర్తి గుండె నుంచి రక్తం ఏరులై పారింది. దీంతో ఆయన అహింసను స్వీకరించాడు. ఇక్కడ నేను కూడా అహింస మార్గం వైపే నిలబడ్డాను' అని లేఖ‌లో రాసుకొచ్చాడు.

నేను ఒక‌టి చెప్తే త‌న‌కు మ‌రోలా అర్థ‌మైంది
అయితే ఇప్పుడు మాత్రం ప్లేటు తిప్పేశాడు మ‌న్సూర్‌. తాన‌స‌లు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌లేద‌ని అంటున్నాడు. 'నేను నా మేనేజ‌ర్‌తో ఫోన్‌లో మాట్లాడిన‌ప్పుడు మార‌నితువిడు (న‌న్ను చంపేయండి) అని చెప్పాను. కానీ నేను చెప్పింది అత‌డికి మ‌న్నితువిడు(క్ష‌మించండి)లా వినిపించింది. అందుకే లేఖ‌లో అలా రాసిన‌ట్లున్నాడు. నేను త్రిష‌కు సారీ చెప్ప‌డ‌మ‌నేది పెద్ద జోక్' అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వివాదంలో త్రిష‌కు అండ‌గా నిల‌బ‌డ్డ చిరంజీవి, ఖుష్బూల‌పైనా ప‌రువు న‌ష్టం దావా వేశాడు మ‌న్సూర్ అలీ ఖాన్‌.

చ‌ద‌వండి: ఈ శుక్ర‌వారం ఓటీటీలో రిలీజ‌వుతున్న చిత్రాలివే!

మరిన్ని వార్తలు