మోదీ చేస్తే ఒప్పు.. ట్రంప్‌ది తప్పా?!

21 Sep, 2019 09:43 IST|Sakshi
డొనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్ర మోదీ (ఫైల్‌)

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యంలోని ప్రధాని నరేంద్ర మోదీ అభిమానుల్లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమం నూతనోత్సాహం నింపుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా హాజరుకానుండటంతో హౌడీ మోదీకి మరింత క్రేజ్‌ వచ్చింది. భారత ప్రభుత్వం కశ్మీర్‌ అంశంపై చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం.. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు సమీపించడం వంటి అంశాల నేపథ్యంలో... అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల అధినేతలు ఇలా ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొననుండటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి దాదాపు 50 వేల మంది హాజరుకానున్నారంటూ నిర్వాహకులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటు దౌత్యపరంగా విజయం సాధించిందేందుకు మోదీ.. అటు అత్యధిక మంది భారతీయులు నివసించే టెక్సాస్‌లో గెలుపే లక్ష్యంగా ట్రంప్‌.. ‘హౌడీ మోదీ’ని ఉపయోగించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

టెక్సాస్‌.. ట్రంప్‌ను ద్వేషిస్తోందా?!
అగ్రరాజ్యంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న ఆసియన్‌ అమెరికన్లలో అయిదో వంతు మంది భారతీయులే. అందులోనూ టెక్సాస్‌లో జీవించే భారతీయుల సంఖ్య ఎక్కువ. కాబట్టి రాబోయే ఎన్నికల్లోనూ టెక్సాస్‌ ఓటు బ్యాంకు కీలకంగా మారనుంది. అయితే ఇక్కడున్న ఎన్నారైలు గత కొన్నేళ్లుగా డెమొక్రాట్ల వైపే మొగ్గు చూపుతున్న విషయం విదితమే. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ 12 శాతం పాయింట్ల తేడాతో టెక్సాస్‌ హ్యారీస్‌ కౌంటీలో ఓటమి పాలయ్యారు. అదే విధంగా 2018లో జరిగిన సెనేట్‌ రేసులోనూ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి టెడ్‌ క్రూజ్‌ పరాజయం పాలయ్యారు. కాగా 2020లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడిన మహిళా నేతలు కమలా హ్యారిస్‌, తులసి గబ్బార్డ్‌ ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. ఈ ఇద్దరు డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థులే కావడం.. అందులోనూ కమల భారత సంతతికి చెందిన మహిళ కాగా, తులసి హిందువు కావడం వల్ల.. ఇండో అమెరికన్లలో వీరి పట్ల అభిమానం ఉండటం సహజమే.

కాబట్టి  2 లక్షల 70 వేల మందికిపైగా ఓటర్లు ఉన్న టెక్సాస్‌లో విజయం సాధించడం అంటే కాస్త కష్టంతో కూడుకున్న విషయమే అని రిపబ్లిక్‌ పార్టీ నేతలు అంటున్నారు. రాజకీయంగా తమ ఆధిపత్యం కొనసాగుతున్నా... డెమొక్రాట్లకు చెక్‌ పెట్టేందుకు అన్ని విధాలా ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు. ఈ విషయం గురించి ఆ పార్టీ నేత, సిప్రస్‌ ప్రెసింక్ట్‌ చైర్‌వుమన్‌ చార్లెట్‌ లంపే మాట్లాడుతూ... ‘మాకు హ్యూస్టన్‌ ఎంతో ప్రతిష్టాత్మకం. ఒకవేళ హ్యారిస్‌ కౌంటిలో ఓడిపోయినట్లయితే.. టెక్సాస్‌లో ఓటమి ఖాయం. అందుకే ప్రస్తుతం సంప్రదాయక ఓటర్ల దృష్టిని మా వైపునకు మరల్చుకునే ప్రయత్నం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

మోదీ చేస్తే ఒప్పు.. ట్రంప్‌ది తప్పా?!
జాత్యంహకారిగా ముద్ర పడిన ట్రంప్‌.. భారతీయులు సహా ఇతర వలసదారుల హృదయాల్లో స్థానం సంపాదించలేకపోయారన్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వం అనుసరించే వీసా విధానం, జీరో టాలరెన్స్‌ వల్ల ఇండో అమెరికన్లు సహా అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఎంతో మంది విదేశీయుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ... భారతీయుల ప్రియతమ ప్రధానిగా ఉన్న ‘ మోదీ’ కార్యక్రమానికి హాజరుకావడం ద్వారా ఇండో అమెరికన్ల ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న ట్రంప్‌..ఆ మేరకు కాస్త అయినా సఫలీకృతులవుతారని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కార్తిక్‌ రామచంద్రన్‌ అభిప్రాయపడ్డారు. పాలసీ రీసెర్చ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆయన మాట్లాడుతూ... ‘అమెరికాలో జాతీయవాదం వినిపించే అధ్యక్షుడిగా పేరున్న కారణంగా ఇక్కడున్న ఎంతో మంది భారతీయులు ట్రంప్‌ను ద్వేషిస్తున్నారు. కానీ ట్రంప్‌ తరహాలోనే భారతదేశంలో ‘జాతీయవాదం’ పునాదుల మీద ప్రధానిగా ఎదిగిన మోదీ పట్ల మాత్రం విపరీతమైన అభిమానం కలిగిఉన్నారు. అయితే హౌడీ మోదీకి అత్యధిక సంఖ్యలో ఎన్నారైలు హాజరవుతున్న వేళ మోదీ కారణంగా ట్రంప్‌ పట్ల వీరు కాస్త సానుకూలంగా ఉండే అవకాశం లేకపోలేదు. అయితే ఇది కేవలం నా అంచనా మాత్రమే’ అని పేర్కొన్నారు.

2020లో అదే రిపీట్‌ అవుతుంది..
ఇక టెక్సాస్‌లో సంప్రదాయంగా డెమొక్రాట్లకు పడుతున్న ఎన్నారైల ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు రిపబ్లికన్‌ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అవన్నీ కలలగానే మిగిలిపోతాయని.. ఆ రాష్ట్ర డెమొక్రటిక్ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ అభి రెహమాన్ వ్యాఖ్యానించారు. ‘2016లో ఇండో అమెరికన్లు ట్రంప్‌ను తిరస్కరించారు. 2020లోనూ అదే పునరావృతం కాబోతుంది. ఇండియన్‌ కమ్యూనిటీకి కొన్ని విలువలు ఉన్నాయి. స్వతహాగా అగ్రరాజ్యంలో ఎదిగిన ఎన్నారైల పట్ల ట్రంప్‌ పరోక్షంగా విషం చిమ్ముతున్నారు. జాతి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయాన్ని వారు అర్థం చేసుకోగలరు. అందుకే ట్రంప్‌ పట్ల వారికున్న అభిప్రాయం మారుతుందని అనుకోవడం లేదు అని పేర్కొన్నారు.

కాగా ఏషియన్‌ అమెరికన్‌ ఓటర్‌ సర్వే ప్రకారం అధ్యక్షుడిగా ట్రంప్‌ పాలనపై ఇండో అమెరికన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. దాదాపు 66 శాతం మంది ప్రవాస భారతీయులు ట్రంప్‌ అధ్యక్షుడిగా విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు.  

దౌత్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా...
భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం దౌత్య పరంగా అమెరికాతో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు హౌడీ మోదీ కార్యక్రమాన్ని వినియోగించుకోనున్నారని వినికిడి. కశ్మీర్‌ అంశంలో పాకిస్తాన్‌ దుందుడుకు ప్రవర్తనతో పాటు గత కొన్ని నెలలుగా వాణిజ్యపరంగా అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల గురించి కార్యక్రమానంతరం మోదీ..ట్రంప్‌తో చర్చించనున్నట్లు సమాచారం. భారత దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు పెంచేయడంతో.. భారత్‌ కూడా అంతే దీటుగా స్పందించిన సంగతి తెలిసిందే. గతేడాది భారత్, ఇతర దేశాల నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై సుంకాలను అమెరికా పెంచేయడమే కాకుండా, జీఎస్‌పీ కింద భారత్‌కు చెందిన కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్‌ ప్రయోజనాన్ని కూడా ఈ ఏడాది మే నుంచి నిలిపేసింది. దీంతో భారత్‌ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్‌నట్స్‌ తదితర 28 రకాల ఉత్పత్తులపై జూలై నెల నుంచి టారిఫ్‌లను పెంచింది.

ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకొంటూ భారత్ సహా చైనా నేటికీ ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) కల్పించే ప్రయోజనాలను పొందుతున్నాయని అమెరికా ట్రంప్‌ విమర్శించారు. అంతేకాకుండా ఇకపై తాను ఇలా జరగబోనివ్వనని ఆసియా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇరు దేశాధినేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇప్పటికే ఎన్నోసార్లు కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం చేస్తానంటూ ముందుకు వచ్చిన ట్రంప్‌.. మోదీతో భేటీ అనంతరం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో సమావేశం కానున్నారని తాజా సమాచారం. ఈ నేపథ్యంలో కశ్మీర్‌ అంశంలో భారత్‌ నిర్ణయాన్ని సమర్థించిన అమెరికా.. మోదీ పర్యటనతో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా హౌడీ మోదీకి వరద ముప్పు పొంచి ఉండటంతో ఇరు దేశాధినేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమం ఎంతమేరకు సక్సెస్‌ అవుతుందో వేచి చూడాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 22న కార్యక్రమానికి వేదిక కానున్న ఎన్నార్జీ స్టేడియం వాన నీటితో నిండిపోవడంతో వందలాది మంది వాలంటీర్లు సభ ఏర్పాట్లలో నిమగ్నమై సేవలు అందిస్తున్నారు.   

Poll
Loading...
మరిన్ని వార్తలు