Rajasthan Elections 2023: ఆ ముగ్గురూ జేబు దొంగలు.. రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు

22 Nov, 2023 21:10 IST|Sakshi

భరత్‌పూర్ (రాజస్థాన్): ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని పిక్‌పాకెటర్లతో పోలుస్తూ రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు. జేబు దొంగల ముఠా లాగానే ఈ ముగ్గురు కలిసి దేశంలోని ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘జేబుదొంగ ఎప్పుడూ ఒంటరిగా రాడు. ముఠాలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఒకరు ముందు నుంచి, మరొకరు వెనుక నుంచి వస్తారు. ఇంకొకరు దూరం నుంచి గమనిస్తూ ఉంటారు. వీరిలో మీ దృష్టిని మరల్చడమే ప్రధాని నరేంద్ర మోదీ పని.  ముందు నుంచి టీవీల్లో వచ్చి హిందూ-ముస్లిం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలతో ప్రజల దృష్టి మరల్చుతాడు. ఇంతలో అదానీ వెనుక నుంచి వచ్చి డబ్బును దోచుకుంటాడు. ఇక అమిత్ షా మూడవ వ్యక్తి. పర్యవేక్షించడం ఆయన పని. అక్కడ జరుగుతున్నది ఎవరికీ తెలియకుండా చూసుకుంటాడు’ అని పేర్కొన్నారు.

కేంద్రంలో కార్యదర్శి స్థాయి పదవుల నియామకంలో వెనుకబడిన కులాలు, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల భాగస్వామ్యంపై రాహుల్ గాంధీ మరోసారి ప్రశ్నను లేవనెత్తారు. కేంద్రంలో కేవలం ముగ్గరు ఓబీసీలు మాత్రమే సెక్రటరీలుగా పనిచేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయానని, అదీ కూడా చిన్న డిపార్ట్‌మెంట్‌లు కేటాయించారని ఆరోపించారు. జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతోందని రాహుల్‌ విమర్శించారు.

మరిన్ని వార్తలు