రెండు వారాలకో భాష అంతం

23 Feb, 2018 01:02 IST|Sakshi

యునెస్కో జాబితాలో అంతరించే ప్రమాదమున్న భారతీయ భాషలు 40 

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు వారాలకు ఒక భాష కనుమరుగవుతోంది. భారత్‌లో నలభైకి పైగా భాషలు, మాండలికాలు అదే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గదబ, నైకీ అనే గిరిజనతెగల భాషలున్నాయి. పది వేల మంది కంటే తక్కువగా మాట్లాడే భాషలు క్రమంగా కాలగర్భంలో కలిసి పోతాయని పరిశోధకులు చెబుతున్నారు.  

50 ఏళ్లలో 220 భాషలు కనుమరుగు..
మనదేశంలో 780 భాషలకు పైగా ఉనికిలో ఉండగా, గత 50 ఏళ్లలోనే 220 భాషలు కనబడకుండా పోయాయి. దీనిని బట్టి భారతీయ భాషలు ఎంత వేగంగా అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయన్నది స్పష్టమవుతోంది. ఐరాస విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఆధ్వర్యంలో నిర్వహించిన వర్గీకరణ ప్రకారం భారత్‌లోని 197 భాషలు ఈ కోవలోకే వస్తాయి. వల్నరబుల్, డెఫినెట్లి ఎండేంజర్డ్, సివియర్లీ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్‌గా ఆ సంస్థ వర్గీకరించింది. వీటిలో బొరొ, మీథీ మాత్రమే భారత్‌లో అధికారికంగా గుర్తించినవి. ఇతర భాషలకు రాత (లిఖిత) వ్యవస్థ లేదు. జనన గణన డైరెక్టరేట్‌ నివేదిక ప్రకారం...మనదేశంలో 22 షెడ్యూల్డ్‌ భాషలతో పాటు, లక్షకు పైగా మంది మాట్లాడే వంద నాన్‌–షెడ్యూల్డ్‌ భాషలున్నాయి. అయితే యునెస్కో రూపొందించిన కనుమరుగయ్యే ప్రమాదమున్న భాషలు,మాండలికాల జాబితాలో 40 భారతీయ భాషలున్నాయి. ఈ భాషలను పదివేల మంది కంటే తక్కువ మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ భాషలు అంతరించే ప్రమాదముందని హోంశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.  

యునెస్కో జాబితాలోని 40 భారతీయ భాషలివే
►అండమాన్, నికోబార్‌ దీవుల్లో మాట్లాడే 11 భాషలు... గ్రేట్‌ అండమానీస్, జరావా, లామొంగ్సే, లూరో, మ్యుయొట్, ఒంగో, పు, సెనెన్యో, సెంటిలీస్, షోంపెన్, తకహనియిలాంగ్‌. 
►మణిపూర్‌లోని 7 భాషలు...ఐమల్, అక, కొయిరెన్, లామ్‌గంగ్, లాంగ్రాంగ్, పురుమ్, తరావ్‌. 
►హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు భాషలు...బఘతి, హందురి, పంగ్వలి, సిర్‌మౌది.
►మండ, పర్జి,పెంజో(ఒడిశా) కొరగ, కురుబ (కర్ణాటక), గదబ, నైకీ (ఆంధ్రప్రదేశ్‌), కోట, తోడ, (తమిళనాడు), మ్రా, నా (అరుణాచల్‌ప్రదేశ్‌), తై నోరా, తైరాంగ్‌ (అసోం), బంగాని (ఉత్తరాఖండ్‌), బిర్హొర్‌ (జార్ఖండ్‌), నిహాలి (మహారాష్ట్ర), రుగ (మేఘాలయ), టొటొ (పశ్చిమ బెంగాల్‌).

భాషల పరిరక్షణ ఏ విధంగా..
సమస్య తీవ్రత నేపథ్యంలో అంపశయ్యపై ఉన్న భాషలను కాపాడుకోవాలి. ఇలాంటి భాషల ఆడియో, వీడియో డాక్యుమెంటేషన్‌తో పాటు వాటిలోని ముఖ్యమైన కథలు చెప్పడం, జానపద,మౌఖిక సాహిత్యం, సంస్కృతి, చరిత్ర వంటి సాంఘిక,సాంస్కృతిక అంశాలను నిక్షిప్తం చేసుకోవాల్సి ఉంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని డిజిటలైజ్‌ చేయడం ద్వారా ఆయా భాషల వనరులను సంరక్షించుకోవాలి. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు తయారుచేసుకోవాలి. ఈ వనరుల ద్వారా భాషాపరమైన పరికరాలు,పనిముట్లను తయారుచేసుకుని ఈ భాషల వ్యాప్తికి చర్యలు తీసుకోవాలి. ఈ కోవలోని భాషల పదకోషాలు తయారుచేసి, వాటిలోని పదాలను ఏ విధంగా పలకాలన్న దానిపై గ్రంథాలయాల ద్వారా అవగాహన కల్పించాలి. ఆడియో, వీడియో ఉపకరణాల ద్వారా ఇలాంటి భాషలపై విస్తృత ›ప్రచారం చేయాలి. ప్రతీ భాషలో మౌఖిక సాహిత్య భాండాగారం నిక్షిప్తమై ఉన్నందున కనుమరుగయ్యే భాషలపై ఈ విషయంలో ప్రత్యేక దృష్టి నిలపాలి. ప్రస్తుతం చౌకధరలకే స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆడియో, వీడియోలు రికార్డ్‌ చేసి, ఫొటోలు తీసుకుని డేటాను తయారుచేసుకునే వీలుంది. 

మరిన్ని వార్తలు