సూపర్‌ హ్యూమన్స్‌తో మానవాళి అంతం

15 Oct, 2018 04:42 IST|Sakshi

ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ అంచనా

‘బ్రీఫ్‌ ఆన్సర్స్‌ టు ద బిగ్‌ క్వశ్చన్స్‌’ పుస్తకంలో వివరాలు

లండన్‌: స్టీఫెన్‌ హాకింగ్‌.. పరిచయం అక్కర్లేని పేరు. విశ్వ ఆవిర్భావ రహస్యాలను, టైమ్‌ ట్రావెల్‌ సహా భవిష్యత్‌ పరిణామాలను సశాస్త్రీయంగా పండిత, పామరులకు అర్థమయ్యేలా వివరించిన భౌతిక శాస్త్రవేత్త హాకింగ్‌. బిగ్‌ బ్యాంగ్‌ నుంచి బ్లాక్‌ హోల్స్‌ వరకు విశ్వ రహస్యాలను వివరిస్తూ హాకింగ్‌ రాసిన ‘ఎ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌’ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌. మోటార్‌ న్యూరాన్‌ వ్యాధితో బాధపడుతూ, వీల్‌ చెయిర్‌కే పరిమితమైన పరిస్థితిలోనూ ఆయన పరిశోధనలను వదల్లేదు. ఏడు నెలల క్రితమే ఈయన మరణించిన విషయం తెలిసిందే.

ఆయన ఆలోచనలతో కూడిన పుస్తకం ఒకటి త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ప్రస్తుత సాధారణ మానవాళిని సమూలంగా అంతమొందించే ‘సూపర్‌ హ్యూమన్‌’ తరమొకటి రాబోతోందని ‘బ్రీఫ్‌ ఆన్సర్స్‌ టు ద బిగ్‌ క్వశ్చన్స్‌’ అనే పుస్తకంలో హెచ్చరించారు. అత్యాధునిక జన్యుసాంకేతికత సాయంతో అపార మేధోశక్తి సామర్థ్యాలతో రూపొందనున్న ఆ సూపర్‌ హ్యూమన్స్‌తో సాధారణ మనుషులు ఎందులోనూ పోటీ పడలేరన్నారు. ‘సూపర్‌ హ్యూమన్స్‌ జీవం పోసుకున్న తరువాత సాధారణ మానవాళికి మరణం తప్ప మరో మార్గం ఉండదు’ అని స్పష్టం చేశారు.

‘సంపన్నులు తమతో పాటు, తమ పిల్లల డీఎన్‌ఏలో  అవసరమైన మేరకు మార్పులు చేసుకుని.. అద్భుతమైన జ్ఞాపకశక్తి, గొప్ప వ్యాధి నిరోధకత, అంతులేని మేధో శక్తి, మరింత ఆయుర్దాయం.. మొదలైన ఎంపిక చేసుకున్న లక్షణాలతో సూపర్‌ హ్యూమన్స్‌గా తమ సంతతిని వృద్ధి చేసుకుంటారు’ అని చెప్పారు. మేధో సామర్థ్యాన్ని, భావోద్వేగాలను మార్పు చేసుకోగల జన్యు సాంకేతికతను మన శాస్త్రవేత్తలు ఈ శతాబ్దంలోనే అభివృద్ధి చేయగలరని బలంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ముందు జాగ్రత్తగా మానవుల జన్యు క్రమంలో మార్పులు చేయడాన్ని నిషేధించేలా చట్టాలు రూపొందించాల్సి రావచ్చని కూడా ఆయన ఊహించారు.

క్రిస్పర్‌ అనే డీఎన్‌ఏ ఎడిటింగ్‌ విధానాన్ని కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించారు. ప్రమాదకర జన్యువులను మార్చడం లేదా కొత్త జన్యువులను చేర్చడం ఆ విధానం ద్వారా సాధ్యమవుతుంది. ఇది ఆవిష్కృతమై ఆరేళ్లైంది. హాకింగ్‌ పేర్కొన్న ఈ సూపర్‌ హ్యూమన్స్‌ థీయరీని పలువురు శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు. ‘భూమిని, వాతావరణాన్ని.. దాని పరిమితికి మించి దుర్వినియోగపర్చాం. దాని పర్యవసానంగా రానున్న ప్రమాదరక సవాళ్లను ఎదుర్కోవడం ప్రస్తుతం మనకున్న మేధో పరిమితులతో సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో భూమిని సమూల విధ్వంసం నుంచి కాపాడేందుకు హాకింగ్‌ చెబుతున్న సూపర్‌హ్యూమన్స్‌ మనకు అవసరం’ అని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌లో క్లైమేట్‌ సైన్స్‌ బోధించే క్రిస్‌ రాప్లీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు