షాకింగ్‌: ఓజోన్‌ పొరకు అతిపెద్ద చిల్లు..

14 Apr, 2020 14:31 IST|Sakshi
ఓజోన్‌ పొరకు అతిపెద్ద చిల్లు(ఫొటో కర్టెసీ: యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ)

భూ గ్రహ సహజ కవచం ఓజోన్‌ పొరకు మరో పెద్ద చిల్లు పడినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. భూ ఉత్తరార్థ గోళంలో కనుగొన్న ఈ రంధ్రం... గ్రీన్‌ల్యాండ్‌ కంటే మూడు రెట్ల అధిక పరిమాణం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే ప్రజలపై దుష్పభావం పడుతుందని.. అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఈ రంధ్రం తొందర్లోనే దానంతట అదే పూడుకుపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తాజాగా జర్నల్‌ నేచర్‌తో మాట్లాడిన యూరోపియన్‌ అంతరిక్ష సంస్థ శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. ఇక ఈ విషయం గురించి జర్మన్‌ గగనతల కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న శాస్త్రవేత్త మార్టిన్‌ డేమ్రీస్‌ మాట్లాడుతూ..‘‘నా ఉద్దేశం ప్రకారం ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఓజోన్‌ పొరలో అతి పెద్ద రంధ్రాన్ని గుర్తించడం ఇదే తొలిసారి’’అని పేర్కొన్నారు. 

కాగా కాలుష్యం వల్ల ఓజోన్‌ పొర రోజురోజుకీ పలుచబడుతున్న విషయం తెలిసిందే. దీంతో సాధారణంగా ప్రతీ ఏడాది అంటార్కిటికాపై కాలుష్య మేఘాలు కమ్ముకోవడం వల్ల ఓజోన్‌లో రంధ్రాలు ఏర్పడుతున్నాయి.  దీంతో దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఓజోన్‌పొర తీవ్రంగా దెబ్బతింది. అయితే ఆర్కిటిక్‌లో మాత్రం ఇలాంటి పరిణామాలు అరుదు. ఈ ఏడాది బలమైన పవనాలు వీచి.. అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై మేఘాలు దట్టంగా కమ్ముకున్నందు వల్ల అక్కడ ఇలాంటి అరుదైన విషయం చోటుచేసుకుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ప్రస్తుతం నెమ్మదిగా సూర్య కిరణాల తీవ్రత పెరుగుతున్న కారణంగా ఈ పరిస్థితిని అధిగమించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా ఓజోన్‌ పొర దెబ్బతింటే భూమ్మీద అతి నీలలోహిత కిరణాల రేడియేషన్‌ ప్రభావం పెరుగుతున్న విషయం తెలిసిందే. వీటి కారణంగా మానవుల్లో చర్మ క్యాన్సర్‌ సహా వివిధ క్యాన్సర్లు, క్యాటరాక్ట్‌ వంటి కంటిజబ్బులు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుంది. 

ఇక పంటలు కూడా దెబ్బతింటాయి. వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగ క్రియకు విఘాతం ఏర్పడి వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. ఆహార లభ్యతకు విఘాతం కలుగుతుంది. అంతేగాకుండా అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల సముద్రాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన సముద్రపు నాచు నశించి, వాటి మనుగడ ప్రమాదంలో పడుతుంది. పెంపుడు జంతువులకు కూడా వివిధ క్యాన్సర్లు సోకుతాయి. అన్నీ వెరసి ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. అతి నీలలోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటే కలప, దుస్తులు, రబ్బరు వంటి పదార్థాలు కూడా త్వరగా నశిస్తాయి. ఇక ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి కరోనా ఉద్భవించి మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న వేళ.. ఇప్పటికైనా పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండాలని ప్రకృతి ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు