భారీ అగ్ని ప్రమాదం; 23 మంది మృతి

29 Nov, 2018 08:51 IST|Sakshi

చైనాలో పేలిన రసాయన ట్రక్కు  

పలువురికి తీవ్రగాయాలు

బీజింగ్‌: చైనాలో ఓ రసాయన కంపెనీ వెలుపల భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదకర రసాయనాలు తరలిస్తోన్న ట్రక్కు పేలి కనీసం 23 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని క్యోడోంగ్‌ జిల్లా జాంగ్జియకోలోని హెబీ షెంగువా రసాయన పరిశ్రమ వెలుపల బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కెమికల్‌ ప్లాంట్‌ నుంచి ఓ ప్రమాదకర రసాయనాన్ని బయటకు తరలించే క్రమంలో భాగంగా ట్రక్కు ట్యాంకర్‌లో నింపారు. అనంతరం ట్రక్కు ప్లాంటు నుంచి బయటకు వెళ్లగానే పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఈ మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో అక్కడే ఉన్న సుమారు 50 ట్రక్కులు పేలిపోయాయి.

ఈ ఘటనలో కనీసం 23 మంది మంటల్లో చిక్కుకుని మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చింది. అత్యవసర విపత్తు నిర్వహణ సహాయమంత్రి ఫు జియాన్‌హువా ప్రమాదం జరిగిన ప్లాంటును సందర్శించి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సరిగ్గా ఐదు రోజుల క్రితం చైనాలోని జిలిన్‌ ప్రాంతంలో ఓ గిడ్డంగిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 50 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు