తెల్ల జుట్టు రహస్యం తెలిసిపోయిందోచ్!

2 Mar, 2016 16:32 IST|Sakshi
తెల్ల జుట్టు రహస్యం తెలిసిపోయిందోచ్!

జుట్టుకు రంగు వేసుకొని.. వేసుకొని విసిగిపోయారా? ఇక ఆ రంగులకు, బ్రష్‌లకు ప్యాకప్ చెప్పేయొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. అందరినీ వేధిస్తున్న తెల్లజుట్టు బెంగ ఇక అక్కర్లేదట. జుట్టు తెల్లబడటానికి కారణమైన జన్యువును కనుగొన్నామని.. ఇది మరింత విప్లవాత్మక మార్పులకు దారితీయనుందని లండన్  పరిశోధకులు చెబుతున్నారు. ఐఆర్ఎఫ్ 4 అనే జన్యువు వల్లే జుట్టు రంగు మారుతోందని గుర్తించారు. మెలనిన్‌ను నియంత్రిస్తున్న ఈ జన్యువే జుట్టును కూడా తెల్లబరుస్తోందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ ఆవిష్కరణతో జట్టు తెల్లబడటాన్ని నిరోధించడం భవిష్యత్తులో సాధ్యమే అంటున్నారు.

జుట్టు రంగు, సాంద్రత, ఆకారాన్ని ప్రభావితం చేసే జన్యువులను గుర్తించేందుకు లాటిన్ అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఆరువేల మందిపై ఈ పరిశోధన సాగింది. జుట్టు తొందరగా తెల్లబడటానికి కేవలం జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు కాకుండా.. మనిషిలోని జన్యువే ప్రధాన పాత్ర పోషిస్తోందని లండన్ శాస్త్రవేత్తలు తేల్చారు.

బట్టతల రావడానికి, జుట్టు రంగును మార్చే జన్యువులను ఇప్పటికే గుర్తించినా, మానవుల్లో జుట్టు తెల్లగా మారడానికి కారణమైన జన్యువును గుర్తించడం ఇదే ప్రథమమని, చాలా కీలకమైందంని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (యూసీఎల్) కు చెందిన డాక్టర్ కౌస్తుభ్  అధికారి చెప్పారు. ఇది ఇంతకు ముందెన్నడూ జరగని పరిశోధన అని పేర్కొన్నారు. ఇది కాస్మోటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందంటున్నారు. మానవ వృద్ధాప్య జీవశాస్త్రం అంశాల పరిశోధనలో తమ అధ్యయనం మంచి పరిణామమని ప్రొఫెసర్ ఆండ్రెస్ రూయిజ్- లినారెస్ చెప్పారు. గడ్డం దగ్గర జుట్టు మందం, కనుబొమ్మల మందాన్ని, వైవిధ్యాన్ని నియంత్రించే జన్యువులను కూడా తమ పరిశోధనలో గుర్తించినట్టు తెలిపారు.

వేసవిలో మెదడును చల్లగా ఉంచేందుకు ఉంగరాల జుట్టు సహాయపడుతుందని తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. ఉత్తర, దక్షిణ ప్రాంత వాసుల జుట్టు స్ట్రయిట్‌గా ఉండటానికి  కూడా ఇదే కారణమన్నారు. తీవ్రమైన చలి నుంచి తట్టుకునేందుకు వీలుగా వారి జుట్టు సాదాగా ఎదుగుతుందంట. యూరోపియన్లలో 20 ఏళ్లకు ముందు, తూర్పు ఆసియన్లలో 30లలో,  సహారా ఆఫ్రికన్లలో 40లలో  జుట్టు తెల్లబడటం మొదలవుతుందని తెలిపారు. భారత సంతతికి చెందిన డాక్టర్ కూడా భాగస్వామిగా ఉన్న ఈ పరిశోధన.. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో  ప్రచురితమైంది.

>
మరిన్ని వార్తలు