Israel-Hamas war: దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్‌

11 Dec, 2023 05:17 IST|Sakshi

యుద్ధం కోసం రూ.834 కోట్ల ఆయుధాలు అమ్మేందుకు అమెరికా సిద్ధం

‘వీటో’తో, ఆయుధాలతో సహకరిస్తున్న అమెరికాకు థాంక్యూ: నెతన్యాహు

డెయిర్‌ అల్‌–బాలాహ్‌(గాజా స్ట్రిప్‌): హమాస్‌ మెరుపుదాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ మొదలుపెట్టిన దాడులు భీకర రూపం దాలుస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్యసమితి తెచ్చిన తీర్మానాన్ని అమెరికా తన వీటో అధికారంతో కాలదన్నిన దరిమిలా ఇజ్రాయెల్‌ ఆదివారం మరింత రెచ్చిపోయింది. అమెరికా నుంచి తాజాగా మరింతగా ఆయుధ సంపత్తి అందుతుండటంతో ఇజ్రాయెల్‌ భీకర గగనతల దాడులతో చెలరేగిపోతోంది.

23 లక్షల గాజా జనాభాలో దాదాపు 85 శాతం మంది బతుకుజీవుడా అంటూ స్వస్థలాలను వదిలిపోయినా సరే ఆదివారం ఇజ్రాయెల్‌ దాడుల తీవ్రతను తగ్గించకపోవడం గమనార్హం. దాదాపు రూ.834 కోట్ల విలువైన యుద్ధట్యాంక్‌ ఆయుధాలను ఇజ్రాయెల్‌కు అమ్మేందుకు అమెరికా అంగీకరించడం చూస్తుంటే ఇజ్రాయెల్‌ సేనల దూకుడు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. ‘ఐరాస భద్రతా మండలిలో మాకు బాసటగా అమెరికా నిర్ణయాలు తీసుకుంటోంది. యుద్ధం కొనసాగింపునకు వీలుగా కీలక ఆయుధాలు అందేందుకు సహకరిస్తున్న అమెరికాకు నా కృతజ్ఞతలు’ అని ఆదివారం ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు వ్యాఖ్యానించారు.  

యుద్ధం ఆగదు: ఇజ్రాయెల్‌
‘హమాస్‌ను ఈలోపే అంతంచేయాలని అమెరికా మాకు ఎలాంటి గడువు విధించలేదు. హమాస్‌ నిర్మూలన దాకా యుద్ధం కొనసాగుతుంది. హమాస్‌ అంతానికి వారాలు కాదు నెలలు పట్టొచ్చు. బం«దీలందర్నీ విడిపిస్తాం’’ అని ఇజ్రాయెల్‌ జాతీయ భద్రతా సలహాదారు టజాచీ హెనెగ్బీ శనివారం అర్ధరాత్రి తేలి్చచెప్పారు. ‘‘ గాజాలో సరైన సాయం అందక సరిదిద్దుకోలేని స్థాయిలో అక్కడ మానవ విపత్తు తీవ్రతరమవుతోంది.

ఇది పశ్చిమాసియా శాంతికి విఘాతకరం’’ అని ఖతార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తంచేశారు. షిజాయాహ్, జబాలియా శరణార్థి శిబిరాల వద్ద నిరంతరం దాడుల కొనసాగుతున్నాయి. ‘‘కదిలే ప్రతి వాహనంపైనా దాడి జరుగుతోంది. శిథిలాలతో నిండిన మా ప్రాంతాలకు అంబులెన్స్‌లు రాలేకపోతున్నాయి’’ అని జబాలియా ప్రాంత స్థానికురాలు ఒకరు ఏడుస్తూ చెప్పారు. ఖాన్‌ యూనిస్‌ పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ హమాస్, ఇజ్రాయెల్‌ సేనల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి.  

గంటలు నిలబడినా పిండి దొరకట్లేదు
సెంట్రల్‌ గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. ‘‘ ఇంట్లో ఏడుగురం ఉన్నాం. ఐరాస ఆహార కేంద్రానికి రోజూ వస్తున్నా. ఆరేడు గంటలు నిలబడ్డా రొట్టెల పిండి దొరకట్లేదు. రెండు వారాలుగా ఇదే పరిస్థితి. పిండి కరువై ఉట్టిచేతుల్తో ఇంటికెళ్తున్నా’’ అని అబ్దుల్లాసలాం అల్‌–మజ్దాలా వాలా చెప్పారు. ఇప్పటిదాకా 17,700 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.

>
మరిన్ని వార్తలు