ఈగ.. యముడి మెరుపు తీగ

26 Nov, 2017 01:57 IST|Sakshi

వాషింగ్టన్‌: దోమలు, బొద్దింకలు, ఇతర పురుగులు మన ఇంట్లోకి వస్తే వాటిని చంపడమో.. బయటకు తరమడమో చేస్తే గానీ మనకు నిద్రపట్టదు. అయితే ఇళ్లల్లోకి వచ్చే ఈగలను మనం అంతగా పట్టించుకోం. దీనికి కారణం అవి అంత ప్రమాదకరమైనవి కావని మనందరి అభిప్రాయం. కానీ మన అభిప్రాయం తప్పంటున్నారు శాస్త్రవేత్తలు. వివిధ జాతులకు చెందిన హానికరమైన బ్యాక్టీరియాలను వందల సంఖ్యలో మన ఇళ్లల్లోకి ఈగలు మోసుకొస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అధ్యయనం హెచ్చరిస్తోంది.

ముఖ్యంగా విహారయాత్రల్లో ఈగల గోల ఎక్కువగా ఉంటుంది.. అక్కడికి తీసుకెళ్లిన ఆహారం, ఇతర వంట పదార్థాలపై అవి వాలిపోతాయి. అయితే ఇలా ఈగలు వాలిన ఆహారాన్ని తినవద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సుమారు 116 ఈగ జాతులపై పరిశోధన చేశారు. దీనిలో భాగంగా ఈగల కాళ్లు, రెక్కలను పరిశీలించగా.. కాళ్లపై అధిక శాతం హానికరమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు. ఈగలు వాలినప్పుడు ఇవి ఒకచోట నుంచి మరోచోటుకి వ్యాప్తి చెందుతున్నాయని వర్సిటీ పరిశోధకులు స్టీఫెన్‌ షుస్టెర్‌ వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు