గే డేటింగ్ యాప్ 'గ్రైండర్' వాటా అమ్మకం

12 Jan, 2016 17:25 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా 196 దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కుల (గే అండ్ బైసెక్సువల్స్) మధ్య సంబంధాలను కుదిర్చే డేటింగ్ యాప్ 'గ్రైండర్' తనకూ ఓ మంచి సంబంధం చూసుకొంది. కంపెనీలో 60 శాతం వాటాను ప్రముఖ గేమింగ్ దిగ్గజమైన 'బీజింగ్ కున్‌లున్ టెక్ కంపెనీ'కి దాదాపు 977 కోట్ల రూపాయలకు అమ్మేసింది. 2011లో ఉత్తమ డేటింగ్ యాప్‌గా అవార్డు అందుకున్న గ్రైండర్ లాభాల బాటలో నడుస్తోంది.

ఏడాదికి దాదాపు 200 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ప్రపంచవ్యాప్తంగా కంపెనీని విస్తరించేందుకు, కొత్త కమ్యూనికేషన్ వ్యవస్థలను ప్రవేశపెట్టేందుకు వీలుగా కంపెనీలో వాటాను విక్రయించాల్సి వచ్చిందని గ్రైండర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మ్యాక్‌చంకిన్ ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ యాప్‌ను రోజుకు 20 లక్షల మంది వినియోగదారులు వీక్షిస్తున్నారని, వారిలో ఒక్కొక్కరు సగటున 54 నిమిషాల పాటు సైట్ మీద ఉంటున్నారని ఆయన తెలిపారు.

ఈ యాప్‌ను ఉపయోగించేవారు తమ ప్రొఫైల్‌తోపాటు తమ గురించి పరిచయం చేసుకోవచ్చు. స్థానికులతో సంబంధాలు నెరపుకోవచ్చు. క్లుప్తంగా మాటామంతీ జరుపుకోవచ్చు. 2009లో గ్రైండర్‌ను స్థాపించిన తర్వాత.. అనతికాలంలో అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. గేమింగ్ రంగంలోనే కాకుండా ఇతర సామాజిక రంగాల్లోకి కూడా చొచ్చుకుపోవాలనే ఉద్దేశంతో గ్రైండర్‌లో వాటాను కొనుగోలు చేశామని బీజింగ్ కున్‌లున్ కంపెనీ వివరించింది. వాటా విక్రయం వల్ల సిబ్బందిలో కోత, మార్పులు ఉండవని.. పాత సిబ్బందిని కొనసాగించాలనే షరతుతోనే వాటాను విక్రయించామని మ్యాక్ తెలిపారు.

మరిన్ని వార్తలు