గ్రాండ్‌ పేరెంట్స్‌ ఘనత ఎంతో తెలుసా?

10 Sep, 2018 20:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక సమాజంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ పేరెంట్స్‌ (తాతలు, అమ్మమ్మలు లేదా బాపమ్మలు) నిర్వహిస్తున్న పాత్ర అంతా ఇంతా కాదు. పిల్లల సంరక్షణ నుంచి వారి పెళ్లిళ్ల వరకు వారు నిర్వహిస్తున్న పాత్ర అమోఘమైనది. పిల్లల సంరక్షణతోపాటు వారికి సామాజిక మార్గనిర్దేశంలో వారి పాత్ర మరువ లేనిది. కుటుంబ పోషణలో కూడా వారి పాత్ర ముఖ్యమైనదే. గ్రాండ్‌ పేరెంట్స్‌ పిల్లలను సంరక్షిస్తున్న కారణంగా ఒక్క బ్రిటన్‌ కుటుంబానికి ఏడాదికి ఏడు వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయంటే ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకంటే ఆ దేశంలో పిల్లల సంరక్షణ చాలా ఖరీదు. అయితే ఆస్ట్రేలియాలోనైతే 200 కోట్ల డాలర్లను ఓ కుటుంబం ఏడాదికి ఆదా చేయవచ్చు.

నేడు ప్రపంచ జనాభా 760 కోట్లుకాగా, వారిలో 18 శాతం అంటే, 140 కోట్ల మంది గ్రాండ్‌ పేరెంట్స్‌ ఉన్నారు. అయితే వారి సంఖ్య ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంది. పెళ్లిళ్ల వయస్సు, తల్లిదండ్రుల్లో సంతానోత్పత్తి శక్తి, ప్రజల ఆయుషు ప్రమాణం అంశాలపై ఆధారపడి వారి సంఖ్య ఉంటుంది. వారి సంఖ్య ఇథియోపియా, కెన్యా, నైజీరియా, పాకిస్థాన్‌ దేశాల్లో అతి తక్కువగా 15 శాతం ఉండగా, కోస్టారికా, జపాన్, రష్యా, ఉక్రెయిన్‌లో 25 శాతం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ పేరెంట్స్‌లో మహిళల సంఖ్యనే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది అవ్వలు ఉండగా, 58 కోట్ల మంది తాతలు ఉన్నారు. ఇక పిల్లలే లేని వద్ధులు 60 లక్షల మంది ఉన్నారు. భారత్, పాకిస్థాన్, ఇండోనేసియా, టర్కీ లాంటి వర్ధమాన దేశాల్లో 40 ఏళ్లకు పైబడి పిల్లలు లేని వారి సంఖ్య ఐదు శాతానికన్నా తక్కువగా ఉంది. 

అదే అభివద్ధి చెందిన ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాల్లో 40 ఏళ్లకు పైబడి పిల్లలులేని తల్లుల సంఖ్య పది శాతానికిపైగా ఉండగా 50 ఏళ్లకు పైబడి పిల్లలులేని తల్లుల సంఖ్య 20 శాతానికిపైగా ఉండడం ఆశ్చర్యం. ఓ కుటుంబంలోని భార్యాభర్తలు ఎప్పుడు గ్రాంట్‌ పేరెంట్స్‌గా మారుతారన్న విశయం సాధారణంగా మొదటి సంతానం ఎప్పుడయింది అన్నదానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కెనడా, జర్మనీ, ఇటలీ, నెదర్‌లాండ్స్, స్విట్జర్‌లాండ్‌ లాంటి అభివద్ధి చెందిన దేశాల్లో ఓ మహిళకు తన 30వ ఏటా మొదటి సంతానం కలుగుతుంది. అంటే వారు గ్రాండ్‌ మదర్‌ అయ్యే వయస్సు దాదాపు 60 ఏళ్లు. బంగ్లాదేశ్, చాడ్, మాలి, నైగర్, జాంబియాలాంటి దేశాల్లో 20 ఏళ్లలోపే మహిళలకు మొదటి సంతానం కలుగుతుంది. అంటే వారు 40 ఏళ్ల నాటికి గ్రాండ్‌ మదర్స్‌ అవుతారు. ఎక్కువ సంతానోత్పత్తి కలిగిన ఉగాండ, కెన్యా, నైజీరియా లాంటి దేశాల్లో 50 ఏళ్లు మించిన వారి సంఖ్య వారి దేశ జనాభాలో పది శాతం కాగా, జర్మనీ, ఇటలీ, జపాన్‌ లాంటి దేశాల్లో 50 ఏళ్లు పైబడిన వారు వారి జనాభాలో దాదాపు 40 శాతం కావడం విశేషం.

ఓ కుటుంబంలో గ్రాండ్‌ పేరెంట్స్‌ ఎంతకాలం జీవించి ఉంటారనే అంశం వారి పెళ్లీడు వయస్సు, అక్కడి జీవన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. 20వ శాతాబ్దం ప్రారంభంలో అమెరికాలో మనిషి ఆయుష్సు ప్రమాణం 47 ఏళ్లుకాగా, గ్రాంట్‌ పేరెంట్స్‌గా 30 ఏళ్లు బతికిన వాళ్లు 20 శాతంకాగా, 77 ఏళ్ల ఆయుష్సు ప్రమాణం కలిగిన నేటి తరంలో గ్రాంట్‌ పేరెంట్స్‌గా 30 ఏళ్లు బతికే వాళ్లు దాదాపు 80 శాతం ఉంటున్నారు. గ్రాంట్‌ పేరెంట్స్‌లో కూడా ఎక్కువ కాలం బతుకుతున్న వాళ్లు మహిళలే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా నేడు బతికున్న శాతాధిక వద్ధుల్లో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. వీరి సంఖ్య 21వ శాతాబ్దంలో మూడు రెట్లు పెరిగింది. 

ప్రపంచవ్యాప్తంగా శతాధిక వద్ధుల సంఖ్య నేడు 50 లక్షలుకాగా, వీరి సంఖ్య 2030 నాటికి బాగా పెరగనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని ఎనిమిదేళ్ల పిల్లల్లో 70 శాతం మంది గ్రేట్‌ గ్రాండ్‌ పేరంట్స్‌ (ముత్తాతలు, ముత్తవ్వలు) అయ్యే అవకాశం ఉందని అంచనాలు తెలియజేస్తున్నాయి. ఆధునిక సమాజంలో గ్రాండ్‌ పేరెంట్స్‌ పాత్ర విశేషంగా పెరిగింది. భార్యాభర్తల్లో ఇద్దరు ఉద్యోగస్థులైతే పిల్లలను పూర్తిగా గ్రాండ్‌ పేరెంట్లే చూసుకోవాల్సి వస్తోంది. ఒంటిరి తల్లి లేదా ఒంటరి తండ్రున్న కుటుంబాల్లో కూడా పిల్లల పెంపకం బాధ్యత గ్రాండ్‌ పేరెంట్స్‌పైనే పడుతోంది. ఇక ఉద్యోగార్థం విదేశాలకు వలసపోయిన కుటుంబాల్లో వీరి పాత్ర మరీ ముఖ్యంగా తయారయింది. చాలా కుటుంబాల్లో గ్రాండ్‌ పేరంట్స్‌ పిల్లల పోషణతోపాటు ఆర్థికంగా కూడా అండగా ఉంటుందన్నారు. ఇంత పాత్రను పోషించే గ్రాంట్‌ పేరెంట్స్‌ గౌరవార్థం నేడు ప్రపంచంలోని ఎక్కువ దేశాలు ప్రతి ఏటా సెప్టెంబర్‌ 9వ తేదీన వారి దినోత్సవాన్ని జరుపుతున్నాయి. ఈ సారి కూడా ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఎస్టోనియా, జర్మనీ, ఇటలీ, మెక్సికో, పోలండ్, సింగపూర్, స్పెయిన్, బ్రిటన్‌ దేశాలు జరుపుకోగా అమెరికా ఈ రోజు అంటే సెప్టెంబర్‌ 10వ తేదీన జరుపుకుంటోంది. భారత్‌లో ఇది అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. 

మరిన్ని వార్తలు