నాకు అవార్డులు అక్కర్లేదు : గ్రెటా థంబర్గ్‌

30 Oct, 2019 10:11 IST|Sakshi

వాషింగ్టన్‌ : పర్యావరణ పరిరక్షణకై విశేష కృషి చేస్తున్నందుకుగానూ స్వీడిష్‌ యువ కెరటం గ్రెటా థంబర్గ్‌ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఈ ఏడాది పర్యావరణ అవార్డు విజేతగా స్వీడన్‌, నార్వే ఆమె పేరును ప్రకటించాయి. ఈ క్రమంలో గ్రెటాకు అవార్డుతో పాటు 3 లక్షల యాభై వేల దానిష్‌ క్రోనర్లు(దాదాపు 35 లక్షల రూపాయలు) బహుమతిగా లభించాయి. అయితే గ్రెటా మాత్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డును తిరస్కరించారు. తనకు అవార్డులు అక్కర్లేదని, వాతావరణ మార్పుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే చాలు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న గ్రెటా ఈ మేరకు... ‘ వాతావరణ మార్పు ఉద్యమానికి ఇదే కాదు ఇలాంటి అవార్డులు ఏమీ అక్కర్లేదు’ అని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ‘మన రాజకీయ నాయకులు, ప్రజల సహకారం మాత్రమే మనకు కావాలి. సైన్స్‌ చెబుతున్న వాస్తవాలు వారు గ్రహించాలి’ అని విఙ్ఞప్తి చేశారు.

ఇక తనకు అవార్డు ప్రకటించిన సందర్భంగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... పర్యావరణం విషయంలో నార్డిక్‌(స్వీడన్‌, నార్వే, ఫిన్లాండ్‌, ఐస్‌లాండ్‌, డెన్మార్క్‌) దేశాలు వ్యవహరిస్తున్న తీరును గ్రెటా విమర్శించారు. ‘ చాలా అందమైన మాటలు చెబుతారు. అయితే కర్భన ఉద్గారాల విషయానికి వచ్చేసరికి మాత్రం వెనకడుగు వేస్తారు. తలసరి ఆదాయం గురించి లెక్కిస్తారు గానీ ఒక్కక్కరు పర్యావరణానికి ఎలా హాని చేస్తున్నారో మాత్రం లెక్కలు వేయరు’ అని చురకలు అంటించారు. కాగా.. ‘‘నా కలల్ని, నా బాల్యాన్నీ మీరు దొంగిలించారు. వట్టి మాటలు మీవి. మీకేం పట్టదా? ప్రజలు జబ్బున పడుతున్నారు. చనిపోతున్నారు. మొత్తం పర్యావరణమే ధ్వంసమైపోయింది. కొద్దిమంది అదృష్టవంతులలో నేనొక దానిని. మేం బతికే ఉన్నాం. అంతరించిపోతున్న జీవజాతుల అంతిమ దినాలలో ఆఖరి శ్వాసను పీలుస్తూ కొన ఊపిరితో ఉన్నాం. మీకు డబ్బు కావాలి. అభివృద్ధి కావాలి. వాటి కోసం కట్టుకథలతో మమ్మల్ని మభ్యపెడుతున్నారు. హౌ డేర్‌ యూ!!’’ అంటూ అమెరికా కాంగ్రెస్‌ వేదికగా ప్రజాప్రతినిధులను, ప్రపంచ దేశాధినేతలను ప్రశ్నించి గ్రెటా పతాక శీర్షికల్లో నిలిచిన విషయం తెలిసిందే.

కాగా అస్‌పెర్జర్‌ సిండ్రోమ్‌తో బాధ పడుతున్న 16 ఏళ్ల గ్రెటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్‌లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్‌24 సదస్సులో ప్రసంగించారు. ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ పేరిట వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తూ ‘మా గురించి పట్టించుకోమని అడుక్కోవడానికి ఇక్కడకు రాలేదు. చాలా ఏళ్లుగా మమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా ఎన్నోసార్లు క్షమించాం. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు భవిష్యత్తును అంధకారం చేస్తాయి. ప్రజల చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించి ప్రపంచ దేశాధినేతపై విరుచుకుపడ్డారు. ఇక కర్భన ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ... భారత ప్రధాని మోదీకి సైతం ఓ పవర్‌ఫుల్‌ వీడియో మెసేజ్‌ పంపారు.  

మరిన్ని వార్తలు