Global Warming In 2023: 2023 హాటెస్ట్‌ వేసవి

25 Sep, 2023 04:56 IST|Sakshi

కనీ వినీ ఎరుగని వడ గాడ్పులు 

గ్లోబల్‌ వారి్మంగ్, ఉద్గారాలే కారణం

పులి మీద పుట్రలా ఎల్‌ నినో

మేలుకోకుంటే వచ్చే వేసవి మరింత భయానకమే!  

2023లో ఎండలు అక్షరాలా మండిపోయా యి. ఎంతగా అంటే, మానవ చరిత్రలో రికార్డయిన అత్యంత హెచ్చు ఉష్ణోగ్రతలు ఈ ఎండాకాలంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రికార్డులు బద్దలయ్యేంతటి వడ గాడ్పులు, వాటి అనంతర పరిణామాలు ఇందుకు మరింతగా దోహదం చేశాయి. కొన్ని దశాబ్దాలుగా భూగోళం అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్న పరిణామానికి ఇది ప్రమాదకరమైన కొనసాగింపేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...

2023 వేసవి 1880లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వివరాలు నమోదు చేయడం మొదలు పెట్టిన నాటినుంచి అత్యంత వేడిమితో కూడినదిగా రికార్డు సృష్టించింది. ఈ ఆందోళనకర గణాంకాలను న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గొడార్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ (జీఐఎస్‌ఎస్‌) వెల్లడించింది. ‘ఇప్పటికైనా మేలుకుని గ్లోబల్‌ వారి్మంగ్‌కు, ముఖ్యంగా విచ్చలవిడిగా సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం’ అని  పర్యావరణ ప్రియులు, శాస్త్రవేత్తలు∙ఆందోళన వ్యక్తం చేస్తున్నారు  
 
పులి మీద పుట్రలా...
ఈ వేసవిలో ఎండలు గత రికార్డులన్నింటిన్నీ బద్దలు కొట్టడం వడ గాడ్పుల పాత్ర చాలా ఎక్కువే. ఈ ఏడాది ప్రపంచంలో చాలా ప్రాంతాలను అవి తీవ్రంగా వణికించాయి...
► ఇటు అమెరికా నుంచి అటు జపాన్‌ దాకా, యూరప్‌ నుంచి దక్షిణ అమెరికా ఖండం దాకా కానీ వినీ ఎరగని స్థాయిలో వేడి గాలులు అతలాకుతలం చేసి వదిలాయి.
► ఇటలీ, గ్రీస్‌ తో పాటు పలు మధ్య యూరప్‌ దేశాల్లో విపరీతమైన వర్షపాతానికి కూడా ఈ గాలులు కారణమయ్యాయి.
► ఈ వడ గాడ్పుల దుష్పరిణామాలను ఏదో ఒక రూపంలో ప్రపంచమంతా చవిచూసింది.

ఇవీ రికార్డులు...
ఈ ఏడాది ఎండలు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టి పర్యావరణ ప్రియుల ఆందోళనలను మరింతగా పెంచాయి.
► ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్‌ ఉమ్మడి ఉష్ణోగ్రతలు నాసా రికార్డుల్లోని గత అన్ని గణాంకాల కంటే 0.23 డిగ్రీ సెంటిగ్రెడ్‌ ఎక్కువగా నమోదయ్యాయి.
► అదే 1951–1980 మధ్య అన్నీ వేసవి కా సగటు ఉష్ణోగ్రత కంటే ఏకంగా 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఎక్కువగా తేలాయి!

మేలుకోకుంటే అంతే...
గ్రీన్‌ హౌస్, కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదలకు ప్రధాన కారణమని నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లేబోరేటరీలో క్లైమేట్‌ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్‌ జోష్‌ విల్లిస్‌ అంటున్నారు. ‘ కొన్నేళ్లుగా భూగోళం స్థిరంగా వేడెక్కుతూ వస్తోంది. ప్రధానంగా మనిషి నిర్వాకమే ఈ వాతావరణ అవ్యవçస్థకు దారి తీస్తోంది. సాధారణంగా కూడా ఎల్‌ నినో ఏర్పడ్డప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం రివాజు’ అని ఆయన అన్నారు.
 
ఎలా నమోదు చేస్తారు?
నాసా ఉష్ణోగ్రతల రికార్డు పద్ధతిని జిస్‌ టెంప్‌ అని పిలుస్తారు.
► దీనిలో భాగంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల వాతావరణ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తారు.
► నౌకలు తదితర మార్గాల ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కూడా సేకరిస్తారు.
► 1951–1980 మధ్య కాలాన్ని సూచికగా తీసుకుని, ఆ 30 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏటా ఉష్ణోగ్రతల తీరుతెన్నులు ఎలా ఉన్నదీ లెక్కిస్తారు. మరీ విపరీతమైన మార్పులుంటే తక్షణం అన్ని దేశాలనూ అప్రమత్తం చేస్తారు.

‘ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల దు్రష్పభావం మున్ముందు కూడా ప్రపంచం మొత్తం మీదా చెప్పలేనంతగా ఉండనుంది’
 – బిల్‌ నెల్సన్, నాసా అడ్మినిస్ట్రేటర్‌

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అత్యంత హెచ్చుదల నమోదవడమే ఈసారి కనీ వినీ ఎరుగని ఎండలకు ప్రధాన కారణం.  
– జోష్‌ విల్లిస్, క్లైమేట్‌ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్, నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు