నీటి అడుగున అరవై గంటలు..!

12 Dec, 2016 15:01 IST|Sakshi
నీటి అడుగున అరవై గంటలు..!

ఈత రానివారే కాదు.. గజ ఈతగాళ్లు అరుునా సముద్రంలోకి దూకేముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. పొరపాటున మునిగిపోతే తిరిగి ప్రాణాలతో బయటపడే అవకాశం లేకపోవడమే దీనికి కారణం. మరి, ఏకంగా మూడు రోజుల పాటు సముద్రపు అడుగున ఉండాలంటే..? శవమై తేలుతూ ఏ షార్కులకో ఆహారంగా మారిపోవాలి. లేదూ.. ప్రాణాలతో నిలిచి ఉండాలంటే..? మీరు ‘హ్యారిసన్ ఒకేనే’ అయ్యుండాలి! నిజం.. ఈయన దాదాపు మూడు రోజులు సముద్ర గర్భంలోనే ఉండి పోయాడు..!

29 ఏళ్ల హ్యారిసన్ ఒకేనే నైజీరియాకు చెందిన వంటవాడు. 2013లో ‘జాక్సన్-4’ బోటులో సముద్రంలోకి ప్రవేశించిన బృందానికి వంట చేసేందుకు పనికి కుదిరాడు. అప్పటికి మరికొద్ది నెలల్లో పెళ్లి చేసుకోనున్న ఒకేనే.. ఈ ట్రిప్పునే తన చివరి సముద్ర ప్రయాణంగా భావించాడు. తర్వాత ఎప్పుడూ సముద్రంలోకి వెళ్లనని కూడా కాబోయే భార్యకు మాటిచ్చాడు. అలా మొదలైన అతడి ప్రయాణం ఆ ఏడాది మే 26న ఊహించని మలుపులు తిరిగింది.

 ఉన్నట్టుండి ఉప్పొంగిన అలలు వీరి బోటును బలంగా తాకారుు. ఈ తాకిడికి బోటు అతలాకుతలమైపోరుుంది. ఊహించని విధంగా సముద్రంలోకి మునగడం మొదలుపెట్టింది. అప్పటికి బాత్రూమ్‌లో కాలకృత్యాలు తీర్చుకుంటున్న ఒకేనేకు బయట ఏం జరుగుతోందో కొద్దిసేపు అర్థం కాలేదు. మరోవైపు బోటు నీటిలో మునిగాక కూడా వేగంగా దూసుకుపోతోంది. బోటులోకి నెమ్మదినెమ్మదిగా నీరు చేరడం మొదలైంది. ఒకేనే మినహా సిబ్బంది సముద్రంలోకి కొట్టుకుపోతున్నారు. దీంతో అప్రమత్తమైన ఈ వంటవాడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు పరుగుపెట్టినా అప్పటికే ఆలస్యమైంది. బయటపడే దారే లేదన్నట్టుగా బోటులోనే ఇరుక్కుపోయాడు ఒకేనే. చుట్టూ చిమ్మచీకటి ఆవహించింది. నలువైపులా గదిలోకి నీరు దూసుకొస్తున్నారుు.

 నీరు ముంచుకొస్తుండటంతో ఈ క్యాబిన్‌లోని ఓ గాలి బుడగను ఆధారం చేసుకుని నిలబడసాగాడు ఒకేనే. తన కళ్ల ముందే ఒక్కొక్కరు బోటు నుంచి వెలుపలికి కొట్టుకుపోతుండటం, తాను మాత్రమే చిక్కుకుపోవడం చూసి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. తాను ఎంతగానో నమ్మే జీసస్‌కు కొన్ని వందల సార్లు ప్రార్థన చేశాడు. అదృష్టవశాత్తూ తన గది పూర్తిగా నీటితో నిండుకుపోవడంతో ప్రాణాలతో నిలిచిన ఒకేనే.. దాదాపు 60 గంటలు అలాగే గడిపాడు. శరీరం మీద బాక్సర్స్ తప్ప వేరే దుస్తులు లేకపోవడంతో అతడి ఒళ్లు హూనమైంది. వంద అడుగుల లోతులో చిక్కుకున్న ఈ బోటులోని మృతదేహాల వెలికితీతకు వచ్చిన డైవర్లకు ప్రాణాలతో కనిపించి, ఊహించని షాకిచ్చాడు ఒకేనే. ఆ ప్రమాదంలో ప్రాణాలతో నిలిచిన ఒకే ఒక్కడుగా మిగిలాడు.

మరిన్ని వార్తలు