సరిహద్దుల్లో పందుల తలకాయలు వేలాడదీస్తారా?

23 Aug, 2016 17:29 IST|Sakshi
సరిహద్దుల్లో పందుల తలకాయలు వేలాడదీస్తారా?

బుడాపెస్ట్: సిరియా దేశం నుంచి వస్తున్న ముస్లిం వలసలను నిరోధించేందుకు ఇంతవరకు భౌతిక దాడులకు దిగిన హంగేరి ప్రభుత్వం ఇప్పుడు అనైతిక చర్యకు ఆలోచన చేయడంపై ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెర్బియా సరిహద్దు గుండా దేశంలోకి ముస్లింల వలసలను నిరోధించేందుకు సరిహద్దు కంచె వద్ద తెగ నరికిన పందుల తలలను వేలాడదీయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు, హంగేరి పాలకపక్ష పార్లమెంట్ సభ్యుడు గ్యోర్జి స్కాఫిన్ సూచన చేశారు. దీనికి కొంత మంది పాలకపక్ష సభ్యులు మద్దతు పలగ్గా ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తారు. ఈ సూచనపై మానవ హక్కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి.

ఇప్పటికే సరిహద్దు కంచె వద్ద వలస ప్రజలను భయపెట్టేందుకు  క్యారెట్లతో తయారు చేసి, వేలాడదీసిన ‘దిష్టి బొమ్మ’లను తీసివేయాలని డిమాండ్ చేస్తున్న అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఇప్పుడు అంతకంటే భయంకరమైన ఆలోచన చేయడం పట్ల మండి పడుతున్నాయి. సిరియా దేశాల నుంచి వస్తున్న ముస్లిం ప్రజల వలసలను అరికట్టేందుకు సెర్బియా వద్ద హంగేరి గతేడాదే సరిహద్దును మూసివేసింది. ముట్టుకుంటే కోసుకుపోయే పదునైన రేసర్ లాంటి కంచెను ఏర్పాటు చేసింది. అయినా వలస ప్రజలు దూసుకువస్తుండడంతో హంగేరి సైన్యం వారిపై భౌతిక దాడులకు దిగింది.

మహిళలు, పిల్లలు అనే విచక్షణ చూడకుండా ముస్లిం ప్రజలను పిడిగుద్దులు కురిపిస్తున్నారు. లాటీలు, తుపాకీ మడమలతో చితక బాదుతున్నారు. ఈ సంఘటనలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కూడా స్పందించి ఈ సంఘటనలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా హంగేరి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికీ సరిహద్దుల గుండా దాదాపు పది లక్షల మంది ప్రజలు తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, వారికి ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా వలసలు ఆగడం లేదని హంగేరి ప్రభుత్వం వాదిస్తోంది.

మరిన్ని వార్తలు