భారత్‌తో ఒప్పందాలు అప్పుడే..! కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు

17 Nov, 2023 11:07 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: కెనడా-భారత్ సంబంధాలపై ఆ దేశ ఆర్థిక మంత్రి మేరీ ఎన్‌జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకేసు దర్యాప్తులో భారత్ సహకరించిన తర్వాతే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఉంటాయని తెలిపారు. నిజ్జర్ హత్యకేసులో దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ గురువారం తెలిపిన విషయం తెలిసిందే.

శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సమావేశానికి హాజరైన కెనడా ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి మేరీ ఎన్‌జీ మీడియాతో మాట్లాడుతూ.. "మా దృష్టంతా నిజ్జర్ కేసు దర్యాప్తుపైనే ఉంది. అందుకు భారత్‌ సహకరించేలా చేయడంపైనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పని పూర్తైన తర్వాతే ఇరుదేశాల మధ్య సంబంధాల గురించి ఆలోచిస్తాం. మా దేశానికి చెందిన వ్యక్తి హత్యలో విదేశీ జోక్యం ఉందని ఆరోపణలు రావడాన్ని సీరియస్‌గా తీసుకున్నాం.' అని అయన చెప్పారు.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో ఆరోపించారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదానికి దారి తీసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ దుయ్యబట్టింది. ఈ పరిణామాల తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలతోపాటు వీసాలను కూడా రద్దు చేసుకున్నారు. ఈ కేసులో భారత్ దర్యాప్తుకు సహకరించాలని కెనడా ఒత్తిడి చేస్తోంది. 

ఇదీ చదవండి: ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి

మరిన్ని వార్తలు