నాపై 43,200 సార్లు అత్యాచారం!

12 Nov, 2015 10:14 IST|Sakshi
నాపై 43,200 సార్లు అత్యాచారం!

మనుషుల అక్రమరవాణా, సెక్స్ బానిసలుగా అమ్మేయడం లాంటివి మెక్సికోలో సర్వసాధారణం. అలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి అనుకోకుండా బయటపడిన ఓ యువతి.. తన ఆవేదనను బయటకు చెప్పడంతో ప్రపంచమంతా నివ్వెరపోయింది. నాలుగేళ్ల పాటు ప్రతిరోజూ కనీసం 30 మంది తనపై అత్యాచారం చేసేవాళ్లని.. ఇలా తాను దాదాపు 43,200 సార్లు అత్యాచారానికి గురయ్యానని ఆమె వెల్లడించింది.

12 ఏళ్ల వయసులో ఉండగానే ఖరీదైన బహుమతులు, బోలెడంత డబ్బు, విలాసవంతమైన కార్లు ఇస్తానంటూ ఆమెను మభ్యపెట్టి వ్యభిచారంలోకి దింపారు. మెక్సికోలోని టెనాన్సింగో అనే పట్టణానికి ఆమెను తరలించారు. అది మనుషుల అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రం. మూడు నెలల పాటు అక్కడే ఉన్నానని, తర్వాత తనను అక్కడి నుంచి మరో పెద్ద నగరానికి తరలించి అక్కడ బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రతిరోజూ ఇదే పని అయ్యేదని, తాను ఏడుస్తుంటే వాళ్లు నవ్వేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఓసారి ఓ విటుడు తన మెడమీద ముద్దుపెట్టినట్లు చూడటంతో తనను ఈ వృత్తిలోకి దించిన వ్యక్తి చైన్ తీసుకుని ఒళ్లంతా చీరేశాడని వాపోయింది. ఇస్త్రీ పెట్టెతో వాతలు కూడా పెట్టాడంటూ ఆ గాయాలు చూపించింది.

మెక్సికోలో ప్రతియేటా కనీసం 20 వేల మంది అమ్మాయిలు ఇలాంటి పరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. ఆమెను మెక్సికో నగరంలో నిర్వహించిన యాంటీ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో సంరక్షించారు. ఇప్పుడామె ఈ అక్రమరవాణాపై పోరాటంలో ముందంజలో ఉంది.

మరిన్ని వార్తలు