పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌

19 Aug, 2018 00:51 IST|Sakshi
 పాకిస్తాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌

22 ఏళ్ల అనంతరం నెరవేరిన ప్రధాని కల

ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తా.. పాక్‌ను ముస్లిం సంక్షేమ 

రాజ్యంగా మారుస్తా: ఇమ్రాన్‌ 

భారత్‌ నుంచి మాజీ క్రికెటర్‌ సిద్ధూ హాజరు

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ క్రికెట్‌ దిగ్గజం ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ దేశ ప్రధానిగా సరికొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, పొరుగు దేశాలతో విభేదాలు ఒకవైపు.. ఉగ్రవాదంపై పోరులో వైఫల్యంతో అంతర్జాతీయ ఆంక్షల ముప్పు మరోవైపు పొంచి ఉన్న సమయంలో పాకిస్తాన్‌ పాలనా పగ్గాలు చేపట్టారు. పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌(పీటీఐ) చైర్మన్‌గా ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌(65) దేశ 22వ ప్రధానిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష కార్యాలయంలో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో ఇమ్రాన్‌ ఖాన్‌తో పాకిస్తాన్‌ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌ ప్రమాణం చేయించారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా, భారత మాజీ క్రికెటర్, పంజాబ్‌ మంత్రి నవజోత్‌ సింగ్‌ సిద్ధూ, పలు దేశాల దౌత్యవేత్తలు, ఇతర ప్రత్యేక ఆ హ్వానితులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇమ్రాన్‌ సారథ్యంలో 1992 క్రికెట్‌ ప్రపంచకప్‌ సాధించిన పాక్‌ జట్టులోని వసీం అక్రంతో పాటు ఇతర క్రికెటర్లు కూడా ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు. 

ఉర్దూ పదాలు పలకలేక తడబాటు 
ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్ర మాణ స్వీకారం 40 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. నలుపు, బూడిద రంగు షేర్వానీ ధరించిన ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారం సమయంలో కొంత ఉద్వేగానికి లోనయ్యారు. కొన్ని ఉర్దూ పదాల్ని పలకడంలో తడబడ్డారు. ప్రమాణస్వీకారం అనంతరం ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఇమ్రాన్‌ సైనిక వందనం స్వీకరించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌ను తిరిగి పట్టాల మీదకు తీసుకురావడంపై ప్రథమంగా దృష్టిపెడతానని ఆయన తెలిపారు. పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ అలీ జిన్నాను తన అభిమాన నేతగా పేర్కొన్న ఇమ్రాన్‌.. అవినీతిలో కూరుకుపోయిన పాక్‌ను ముస్లిం సంక్షేమ రాజ్యంగా మారుస్తానని ప్రకటించారు. గతేడాది పాకిస్తాన్‌ కరెన్సీ రూపాయి విలువ దారుణంగా దిగజారింది. ద్రవ్యోల్బణం ప్రమాదకర స్థాయికి చేరుకోగా.. దేశ వాణిజ్య లోటు ఊహించనంతగా పెరిగింది. భారీగా పేరుకున్న రుణాలు, తరిగిపోతున్న విదేశీ మారక నిల్వలపైనే ఇమ్రాన్‌ తక్షణం దృష్టిసారించాల్సి ఉంది. 

ఆ రెండు పార్టీల ఆధిపత్యానికి చెక్‌ 
ఆక్స్‌ఫర్డ్‌లో విద్యనభ్యసించిన ఈ పస్తూన్‌ నాయకుడు శుక్రవారం పాక్‌ జాతీయ అసెంబ్లీలో ప్రధాని పదవికి జరిగిన ఎన్నికలో ప్రతిపక్ష పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌(పీఎంఎల్‌–ఎన్‌) చీఫ్‌ షాబాజ్‌ షరీఫ్‌ను ఓడించారు. ఇమ్రాన్‌కు 176 ఓట్లు రాగా, షాబాజ్‌కు కేవలం 96 ఓట్లు మాత్రమే దక్కాయి. పాక్‌ ప్రధాని అయ్యేందుకు 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో 172 మంది మద్దతు కావాలి. బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలో 54 మంది సభ్యులున్న పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) ఓటు వేయకపోవడంతో ప్రధానిగా ఇమ్రాన్‌ ఎన్నిక లాంఛనప్రాయమైంది. జూలై 25న జరిగిన పాక్‌ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం స్వతంత్రుల మద్దతు, మహిళలు, మైనార్టీలకు కేటాయించిన రిజర్వ్‌ సీట్లతో ఆ సంఖ్య 158కి చేరింది. గత కొన్ని దశాబ్దాలు పాకిస్తాన్‌లో అధికారాన్ని పీఎంఎల్‌–ఎన్, పీపీపీ పార్టీలే పంచుకున్నాయి. మధ్యలో 2001 నుంచి 2008 వరకూ ముషార్రఫ్‌ నేతృత్వంలో సైనిక పాలన కొనసాగింది.  

భారత్‌–పాక్‌ శాంతి ప్రక్రియకు దోహదం: సిద్ధూ 
ఇమ్రాన్‌ ఖాన్‌ పాక్‌ ప్రధాని కావడం భారత్‌–పాకిస్తాన్‌ శాంతి ప్రక్రియకు లాభిస్తుందని భారత మాజీ క్రికెటర్‌ సిద్ధూ అభిప్రాయపడ్డారు. ‘పాక్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో నవోదయం మొదలైంది. అది ఆ దేశ గమ్యాన్ని మార్చేయగలదు’అని ఆయన ఆకాంక్షించారు. ప్రమాణస్వీకారానికి ముందు పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వాను సిద్ధూ ఆలింగనం చేసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. వారిద్దరు చిరునవ్వులు చిందించుకోవడంతో పాటు.. మరోసారి ఆలింగనం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. శుక్రవారం వాఘా సరిహద్దు నుంచి లాహోర్‌ చేరుకున్న సిద్ధూ శనివారం ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య శాంతిచర్చల ప్రక్రియ కోసం ఇమ్రాన్‌ ఖాన్‌ చొరవ తీసుకోవాలని.. తాను పాక్‌కు ఓ స్నేహితుడిగానే వచ్చాననీ, ప్రేమ సందేశాన్ని తీసుకొచ్చానని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇమ్రాన్‌కు బహుమతిగా ‘కశ్మీర్‌ శాలువ’ను కూడా బహూకరించారు. కాగా ఇమ్రాన్‌ ఆహ్వానం పంపినప్పటికీ మాజీ క్రికెటర్లు కపిల్‌ దేవ్, సునీల్‌ గవాస్కర్‌లు వ్యక్తిగత కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

1996 నుంచి అలుపెరగని పోరాటం 
క్రికెట్‌ నుంచి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని కల నెరవేరేందుకు దాదాపు 22 ఏళ్లు పట్టింది. పాక్‌ క్రికెటర్లలో మేటిగా పేరుపడ్డ ఇమ్రాన్‌ 1992లో పాకిస్తాన్‌కు క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సాధించిపెట్టారు. నవాజ్‌ షరీఫ్‌ నాయకత్వంలోని పీఎంఎల్‌–ఎన్, బెనజీర్‌ భుట్టో పార్టీ పీపీపీకి చెక్‌పెట్టే లక్ష్యంతో 1996లో పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌(పీటీఐ)ను స్థాపించారు. 2002, 2013ల్లో పాక్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. అయితే 2013 ఎన్నికల్ని రిగ్గింగ్‌ చేశారని ఆరోపిస్తూ.. నవాజ్‌ షరీఫ్‌ రాజీనామా కోసం డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 2014లో లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.

దీంతో ఎన్నికల అక్రమాలపై విచారణకు న్యాయ కమిషన్‌ ఏర్పాటుకు షరీఫ్‌ ప్రభుత్వం దిగివచ్చింది. అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని, పేదరిక నిర్మూలన పథకాలకు శ్రీకారం చుడతానని, విద్య, ఆరోగ్యం మెరుగుపరుస్తానని 2018 ఎన్నికల ప్రచారంలో హామీలిచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌.. మొదటి భార్య జెమీమాతో 2004లో తెగ దెంపులు చేసుకున్నారు. అనంతరం టీవీ యాంకర్‌ రెహం ఖాన్‌తో వివాహ బంధం 10 నెలలకే ముగిసింది. ఈ ఏడాది తన ఆధ్యాత్మిక మార్గదర్శి బుష్రా మనేకాను ఇమ్రాన్‌ పెళ్లి చేసుకున్నారు.

అధ్యక్ష అభ్యర్థిగా అల్వీ
పార్టీ సీనియర్‌ చట్టసభ్యుడు డాక్టర్‌ అరిఫ్‌ అల్వీని పాక్‌ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నామినేట్‌ చేశామని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పీటీఐ తెలిపింది. సెప్టెంబర్‌ 4న అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని పాక్‌ ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో పీటీఐ తన అభ్యర్థిని ప్రకటించింది. దంతవైద్యుడైన అల్వీ పీటీఐ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.   

మరిన్ని వార్తలు