పాక్‌లోనూ ఎన్నికల హడావిడి

8 Nov, 2023 04:51 IST|Sakshi

విశ్లేషణ

పాకిస్తాన్‌ వార్షిక వృద్ధిరేటు అసాధారణంగా అత్యంత తక్కువగా మైనస్‌ 0.5 శాతం దగ్గర ఉంది. ఐఎమ్‌ఎఫ్‌ నుండి అందే బెయిల్‌ అవుట్‌లు, స్నేహ పూర్వక అరబ్‌ దేశాల నుండి, ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ నుండి కాలానుగుణంగా అందుతున్న ఆర్థిక సహాయాల మీదే పాక్‌ నిరంతరం ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ 2024 జనవరిలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. పోటీ నుండి తప్పించబడినప్పటికీ, ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభావాన్ని విస్మరించలేము. నవాజ్‌ షరీఫ్‌ స్వయంగా విధించుకున్న ప్రవాసం నుండి తిరిగి రావడం ఆయన మద్దతుదారులను ఉత్సాహపరిచింది. అయినప్పటికీ, సైన్యం వల్ల ప్రభావితమయ్యే నాయకులతో కూడిన మరో సంకీర్ణ ప్రభుత్వమే అక్కడ ఏర్పడనుందనడంలో ఏ సందేహమూ లేదు.

ప్రస్తుతం జరుగుతున్న వన్డే క్రికెట్‌ ప్రపంచ కప్‌లో అఫ్గానిస్తాన్‌ చేతిలో పాకిస్తాన్‌ పొందిన ఘోర పరాజయం ఆ దేశ ప్రజలకు తీవ్ర నిరాశను కలిగించింది. సహజంగానే క్రికెట్‌లో తమ విజయాల రికార్డ్‌ గురించి పాకిస్తానీలు ఎంతో గర్వపడతారు. అసలే పాకిస్తాన్‌ ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో వారికి ఈ నిరాశ ఎదురైంది. వార్షిక వృద్ధిరేటు అసాధారణంగా అత్యంత తక్కువగా మైనస్‌ 0.5 శాతం దగ్గర ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీనిని ప్రస్తుతం 29.6 శాతంగా అంచనా వేశారు.

ఇప్పుడు 22 శాతంగా అంచనా వేస్తున్న వడ్డీ రేట్లు, దేశంలోని వ్యాపార కార్యకలాపాలను ధ్వంసం చేస్తున్నాయి. కేవలం కొన్ని వారాల క్రితం, విదేశీ మారక ద్రవ్య వనరులు 4.19 బిలియన్‌ డాలర్లకు క్షీణించాయని పాకిస్తాన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఇవి ఒక నెల కఠినంగా క్రమబద్ధీకరించిన దిగుమతులకు మాత్రమే సరిపోతాయి.

ఇది ఆర్థికవేత్తలకు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా ఒక పీడకలగా మారింది. దీనికితోడు గత సంవత్సరం కురిసిన కుండపోత వర్షాలు, కనీవినీ ఎరుగని వరదలు దేశవ్యాప్తంగా 3.3 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపాయి. వరదల ఫలితంగా సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేశారు. 

ఇమ్రాన్‌ వర్సెస్‌ మునీర్‌
ఈ ఆర్థిక ఒడుదొడుకులు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని తొలగించడానికి దారితీసిన రాజకీయ పరిణామాలతో జతకూడి ఉన్నాయి. పంజాబ్‌లో విజయవంతమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన షెహ బాజ్‌ షరీఫ్‌ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రధానిగా నాయకత్వం వహించారు. ఆయన ఆర్థిక గందరగోళాన్ని, దేశవ్యాప్తంగా పెరుగు తున్న రాజకీయ విభజనను ఎదుర్కోవలసి వచ్చింది.

అనివార్యమైన ఐఎమ్‌ఎఫ్‌(అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) కఠిన షరతులను షెహబాజ్‌ అంగీకరించడానికి చాలా తీవ్రమైన చర్చలు జరిగాయి. భారీ విదేశీ సహాయం కోసం తలుపులు తట్టాలంటే, పాకిస్తాన్‌కు ఐఎమ్‌ఎఫ్‌ వెన్నుదన్ను అనేది కనీసం అవసరం. ఐఎమ్‌ఎఫ్‌ నుండి అందే బెయిల్‌ అవుట్‌లు, స్నేహపూర్వక అరబ్‌ దేశాల నుండి, ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ నుండి కాలనుగుణంగా అందుతున్న ఆర్థిక సహాయాల మీదే పాకిస్తాన్‌ నిరంతరం ఆధారపడుతోంది.

ఈలోగా, తనకు ముందటివాడు, గురువు అయిన జనరల్‌ కమర్‌ జావేద్‌ బాజ్వాకు ఎంతో ఇష్టుడైన జనరల్‌ సయ్యద్‌ అసీమ్‌ మునీర్‌ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇమ్రాన్‌  తనను ఐఎస్‌ఐ చీఫ్‌ పదవి నుంచి తొలగించి, రొటీన్‌ పనులు, అప్రధానమైన అసైన్‌ మెంట్‌లు ఇచ్చిన రోజుల గురించి జనరల్‌ మునీర్‌కు సంతోషకరమైన జ్ఞాపకాలు ఉండే అవకాశం లేదు.

ఈ పరిణామాలు ఇమ్రాన్, జనరల్‌ మునీర్‌ నేతృత్వంలోని సాయుధ దళాల మధ్య నిష్ఫలమైన పోరాటానికి దారితీశాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాజీ ఫైజ్‌ ఇసా మద్దతును పొందుతున్న ఇమ్రాన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. కానీ ప్రధాన న్యాయమూర్తి ఇసాకు ఇప్పుడు తన మార్గం అంత తేలిక కాదు.

ఎందుకంటే ఆయన జూనియర్‌ సహోద్యోగులు ఆయన పదవీ విరమణ అనంతర పరిస్థితులను ఊహిస్తున్నారు. వారు ఇమ్రాన్‌ ను రక్షించడంలో ఆయన ఉత్సాహాన్ని ఇప్పుడు పంచుకోవడం లేదు. పైగా ఈ ప్రక్రియలో, ఇప్పుడు కూడా విస్తారమైన అధికారాలను, ప్రభావాన్ని కలిగి ఉన్న సాయుధ దళాల ఆగ్రహానికి గురవుతారు. ఇదే సమయంలో, దేశం ఎన్నికల ప్రక్రియ కోసం సమాయత్తమవుతోంది. 2024 జనవరిలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి.

సెన్యం నుండి తగిన మద్దతుతో, పాకిస్తాన్‌ ఎన్నికల యంత్రాంగం, శాంతి భద్రతల యంత్రాంగం విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాయని ఎవరైనా ఆశించవచ్చు. అయితే, సైన్యం కష్టాలు కూడా కొనసాగుతున్నాయి. జనరల్‌ బాజ్వాకు జనరల్‌ మునీర్‌ ఇష్టమైనవాడు అయినప్పటికీ, పదవి నుండి తొలగించబడిన ఏడాదిన్నర తర్వాత కూడా మంచి ప్రజాకర్షణ కలిగిన ఇమ్రాన్‌ తో ఆయనకు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి.

అదే సమయంలో ఇమ్రాన్‌ కూడా తన అహంకారపూరితమైన, దుర్మార్గపు ప్రవర్తన వల్ల రాజకీయ వర్గాల్లో చాలామంది స్నేహితులను కోల్పో యారు. ముఖ్యంగా, తన పార్టీ ఎన్నికల ఓటమిని నిర్ధారించడానికి సిద్ధంగా ఉన్న ఆర్మీ నాయకత్వంలోని మిత్రులకు దూరమయ్యారు. 

భారత్‌తో ఎలా వ్యవహరిస్తారు?
ఇమ్రాన్‌ లా కాకుండా, జనరల్‌ బాజ్వా స్వాభావికంగా భారత్‌ వ్యతిరేకి కాదు. భారత్‌తో సంబంధాలను మెరుగు పరుచు కునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఆయన అమెరికాకు సన్నిహితుడు. అమెరికా ఆదేశాల మేరకు ఉక్రెయిన్‌ కు పాకిస్తాన్‌ ఆయుధాల అమ్మకాలను కూడా ఆమోదించారు. ఈ చర్య కచ్చితంగా ఐఎమ్‌ఎఫ్‌ సహాయం కోసం అమెరికా సహకారాన్ని పొందడంలో, దివాళా తీయకుండా కాపాడటంలో పాకిస్తాన్‌ కు సహాయపడింది.

జనరల్‌ బాజ్వా అనుసరించిన వాస్తవిక దృష్టిని జనరల్‌ మునీర్‌ చూపించగలడా, 1971లో జనరల్‌ యాహ్యా ఖాన్‌ అనుసరించిన వినాశకరమైన మార్గాన్ని ఇష్టపడతాడా అనేది చూడాలి. 

జనరల్‌ ముషారఫ్‌ హయాంలో జరిగినట్టుగా జమ్మూ కశ్మీర్‌ సమస్యను పరిష్కరించడంలోని పురోగతిలోనే భారతదేశంతో సంబంధాలలో శాంతి నెలకొల్పవచ్చని ఆయన గుర్తుంచుకోవాలి. తాను నాయకత్వం వహించిన కార్గిల్‌ విపత్తు తర్వాత, భారత దేశంతో వివాదాన్ని ప్రోత్సహించడం లేదా రెచ్చగొట్టడం లోని నిష్ప్రయోజకత్వం గురించి, దాంట్లో ఉన్న ప్రమాదాలను గురించి ముషారఫ్‌ పాఠాలు నేర్చుకున్నారు. జనరల్‌ మునీర్‌ భారతదేశంపై గట్టి ప్రకటనలు జారీ చేయడంలో ఖ్యాతిని సంపాదించుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల నియంత్రణ రేఖ వెంబడి, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు, చొరబాట్లు కూడా జరిగాయి.

పాకిస్తాన్‌ ఆర్థిక అవసరాలు, పరిమితుల గురించి జనరల్‌ మునీర్‌ వాస్తవిక దృక్పథాన్ని తీసుకుంటారని అందరూ ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది భారత్, పాకిస్తాన్‌లలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. విదేశాంగ, భద్రతా విధానాల సమస్యలపై భారతదేశంలో ఉన్న విస్తృత జాతీయ ఏకాభిప్రాయంలా కాకుండా, సైన్యం ఆధిపత్యం కొనసాగడం వల్ల కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్‌ ఏ దిశలో నడుస్తుందో విశ్లేషించడం కష్టతరం అవుతోంది.

మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ స్వయంగా విధించుకున్న ప్రవాసం నుండి తిరిగి రావడం పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌లోని ఆయన మద్దతుదారులను ఉత్సాహపరిచింది. అయినప్పటికీ, సైన్యం వల్ల ప్రభావితమయ్యే నాయకులతో కూడిన మరో సంకీర్ణ ప్రభుత్వమే పాకిస్తాన్‌లో ఏర్పడుతుందనడంలో ఏ సందేహమూ లేదు. పోటీ నుండి తప్పించబడినప్పటికీ, ప్రజా జీవితంలో ఇమ్రాన్‌ ప్రభావాన్ని కూడా విస్మరించలేము.

జి. పార్థసారథి 
వ్యాసకర్త జమ్మూ సెంట్రల్‌ యూనివర్సిటీ ఛాన్స్‌లర్, పాకిస్తాన్‌ లో భారత మాజీ హైకమిషనర్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు