వీడిన మిస్టరీ; ప్రియుడి కోసమే భార్యను చంపేశాడు

5 Dec, 2018 09:21 IST|Sakshi
భార్య జెస్సికాతో మితేష్‌ పటేల్‌ (పాత ఫొటో)

వీడిన భారత సంతతి మహిళ హత్య కేసు మిస్టరీ

లండన్‌ : ఈ ఏడాది మే నెలలో లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన భారత సంతతి మహిళ జెస్సికా పటేల్‌(34) మరణ మిస్టరీ వీడింది. భర్త మితేష్‌ పటేల్‌ చేతిలోనే ఆమె దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో గురువారం తుది తీర్పు వెలువడనుందని పేర్కొన్నారు.

వివరాలు... భారత సంతతికి చెందిన జెస్సికా, మితేష్‌లకు మాంచెస్టర్‌ యూనివర్సిటీలో చదివే సమయంలో స్నేహం ఏర్పడింది. తర్వాత కొన్నాళ్లకు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి మిడిల్స్‌బోరోలో గత మూడేళ్లుగా తమ ఇంటికి సమీపంలోనే మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో జెస్సికా అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో మితేష్‌పై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు పలు షాకింగ్‌ నిజాలు వెల్లడించాడు.

ప్రియుడి కోసమే భార్యను చంపేశాడు..
మితేష్‌కు గే(స్వలింగ సంప్కరుల) డేటింగ్‌ యాప్‌ ద్వారా 2015లో సిడ్నీకి చెందిన డాక్టర్‌ అమిత్‌ పటేల్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అతడిని పెళ్లాడాలని భావించిన మితేష్‌ భార్య అడ్డు తొలగించుకునేందుకు పథకం రచించాడు. భార్యతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూనే ఆమెను  హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా అమిత్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి, అక్కడే సెటిల్‌ అవ్వాలని భావించిన మితేష్‌... అందుకు కావాల్సిన డబ్బు కోసం జెస్సికా పేరిట రెండు మిలియన్‌ పౌండ్ల జీవిత బీమా కూడా చేయించాడు.

ఇందులో భాగంగానే ఓ రోజు (మే 20న) జెస్సికా ఫార్మసీ నుంచి ఇంటికి రాగానే ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆమె చేతులు కట్టేసి, ప్లాస్టిక్‌ కవర్‌ను ముఖం చుట్టూ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అయితే భార్యను ఎంతగానో ప్రేమించే మితేష్‌ ఆమెను హత్య చేశాడంటే మొదట కుటుంబ సభ్యులు కూడా నమ్మలేకపోయారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు నిజం బయటపడింది. ‘నా భార్యను చంపేయాలి.. ఆమె హత్యకు కుట్రపన్నుతున్నా... ఇందుకోసం ఇతరుల సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఇన్సులిన్‌ ఓవర్‌డోస్‌.. ఒక మనిషిని చంపడానికి ఎంత మెథడాన్‌ అవసరం పడుతుంది అని జెస్సికా హత్యకు ముందు మితేష్‌ గూగుల్‌లో సెర్చ్‌ చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు.

ఫార్మసీలో అందరికీ తెలుసు..
కాగా 2011 నుంచే గే డేటింగ్‌ యాప్‌లో ప్రిన్స్‌ అనే మారుపేరుతో మితేష్‌ చాటింగ్‌ చేసేవాడని, ఈ విషయం ఫార్మసీలో అందరికీ తెలిసనప్పటికీ వారు రహస్యంగా ఉంచడంతోనే ఈ విషయం జెస్సికా దృష్టికి వచ్చి ఉండదని ఆమె తరపు లాయర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భార్యను హత్య చేయడంతో పాటు, చేసిన నేరం పట్ల కాస్త కూడా పశ్చాత్తాపం లేని మితేష్‌కు ఉరి శిక్షే సరైందని టెసీడ్‌ మెజిస్ట్రేట్‌ జస్టిస్‌ జేమ్స్‌ గాస్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు