ఇస్లామాబాద్‌లో భారత బృందం

2 May, 2018 01:55 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపేందుకు, అనధికార రాయబార విధానం పునరుద్ధరణకు భారత ప్రతినిధుల బృందం గత నెలలో పాకిస్తాన్‌లో పర్యటించింది. ఇటీవల భారత్‌–పాక్‌ల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో తాజా చర్చలు జరగ్గా, భారత బృందానికి విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వివేక్‌ కట్జూ నేతృత్వం వహించారు. ప్రముఖ విద్యావేత్త జేఎస్‌ రాజ్‌పుత్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

పాకిస్తాన్‌ బృందానికి ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఇనాముల్‌ హాక్‌ నేతృత్వం వహించారు. ఏప్రిల్‌ 28 నుంచి 30 వరకు జరిగిన ఈ భేటీలో ఏ విషయాలు చర్చించారనేది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ద్వైపాక్షిక సంబంధాలపై అన్ని కోణాల్లోనూ చర్చలు జరపడంతోపాటు సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

‘నిమ్రానా∙డైలాగ్‌’గా పిలిచే ఈ అనధికార చర్చలు 1990ల్లోనే మొదలయ్యాయి. రాజస్తాన్‌లో ఉండే నిమ్రానా కోటలో తొలిసారి ఈ చర్చలు జరగడంతో వీటికి ఆ పేరు వచ్చింది. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉండగా కూడా ఈ చర్చలు జరిగాయి. మోదీ ప్రధాని అయ్యాక 2015లో ఒక్కసారే జరిగాయి.

>
మరిన్ని వార్తలు